ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను సర్కారు పూర్తి చేసింది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు కసరత్తు ప్రారంభించింది. గతంలోనే ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా.. ఒకరోజు నామినేషన్ల స్వీకరించిన పిదప ఆ ప్రక్రియ వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్ల అమలు విషయమై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే.
– హనుమకొండ, ఫిబ్రవరి 19
కోర్టు ఆదేశాల మేరకు వాయిదాపడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మార్చిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఎన్నికలు నిర్వహించకపోతే నిధులు మళ్లిపోయే అవకాశం ఉందని పంచాయతీ రాజ్ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఈ నెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 జడ్పీటీసీ, 778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అనంతరం ఆరుగురు జడ్పీ చైర్పర్సన్లు, 75 మంది ఎంపీపీలను ఎన్నుకోనున్నారు.
రిజర్వేషన్లు మారే అవకాశం
త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశముంది. గతంలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయగా దాని ప్రకారం ఆయా జిల్లాల్లో సీట్లు కేటాయింపు జరిగింది. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసి ఒక రోజు నామినేషన్లను సైతం స్వీకరించారు. అయితే అదే రోజు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ నిలిపోయింది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పాత విధానంలో ఎన్నికలు జరుగుతాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే రిజర్వషన్లలో తప్పక మార్పులుండే అవకాశం ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ మహిళా స్థానాలతో పాటు, బీసీల రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయని వారంటున్నారు. ఈ విధానంతో బీసీలకు స్థానాలు తగ్గి జనరల్‌కు పెరగనున్నాయి.
హనుమకొండ పరిధిలోకి పరకాల డివిజన్..
హనుమకొండ జిల్లా పరిషత్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. జడ్పీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పరిధిలో ఏడు మండలాలుండగా 86 ఎంపీటీసీలు, ఏడు చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలుండేవి. అయితే వరంగల్ అర్బన్‌ను హనుమకొండ జిల్లా పరిషత్గా మార్పు చేసి వరంగల్ రూరల్ పరిధిలోని పరకాల డివిజన్లోని ఐదు మండలాలను ఇందులో చేర్చారు. దీంతో హనుమకొండ జిల్లా పరిషత్ మొత్తం 12 మండలాలుగా విస్తరించింది. వీటిలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపుర్, ఐనవోలు, వేలేరు, పరకాల డివిజన్లోని ఆత్మకూరు, శాయంపేట, పరకాల, నడికూడ, దామెర మండలాలున్నాయి. అయితే వీటి పరిధిలో ప్రస్తుతం 129 ఎంపీటీసీలు, 12 చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలున్నాయి.
