కోదాడ, జూలై 27 : కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోదాడలోని అండర్ డ్రైనేజీ పనుల్లో కమీషన్ల కోసం బ్లాక్‌లిస్టులో ఉన్న కేఎల్‌ఎస్‌ఆర్‌కు కాంట్రాక్టు కట్టబెట్టిన విషయాన్ని ఆయన ఆధారాలతో చూపించారు. సదరు కాంట్రాక్టర్‌ది చీకటి చరిత్ర అని, ఆయనపై ఇప్పటికీ కోర్టులో కేసులు ఉన్నాయని, డ్రైనేజీ పనులను ఆయనకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు నిగ్గు తేల్చాలన్నారు. వాస్తవ టెండర్లో రూ.182 కోట్లు కోట్ చేస్తే ప్రకటనలో మాత్రం రూ.258 కోట్లుగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని, తేడాగా ఉన్న రూ.72 కోట్ల మతలబు ఏమిటో నిగ్గు తేల్చాలని, బ్లాకు లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు టెండర్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని, నాసిరకం పైపులతో నిర్మిస్తే పారిశుధ్య లోపం వల్ల అస్తవ్యస్తంగా మారి పట్టణ ప్రజలు ఇబ్బందులు పడతారనే తమ ఆవేదన అన్నారు.
నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ సింగారం ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే.. కాంట్రాక్టర్ నాసిరకం పైపులైన్ వేయటం వల్ల ఒక్క గ్రామానికి కూడా చుక్క నీరు అందని విషయా న్ని ఆయన గుర్తు చేస్తూ ఇది ఎవరి హయాంలో జరిగిందో అందరికీ తెలుసన్నారు.. మాధవరం రిజర్వాయర్ పరిస్థితి కూడా సేమ్ అంటూ ఇందుకు మం త్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బాధ్యుడు కాదా అని ప్రశ్నించారు. తక్షణమే బ్లాకు లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ను తొలిగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి కుంటుపడిందని, నాటిన మొక్కలను నీళ్లు పోసే పరిస్థితి కూడా లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 మంది తాత్కాలిక సిబ్బందిని నియమిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారిని తొలిగించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. అవినీతిని అరికట్టడమే తన బాధ్య త అని బొల్లం స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నయీమ్, కౌన్సిలర్ చీమ నరేశ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, పట్టణ నాయకులు కుక్కడపు బాబు, ఉపేందర్ గౌడ్, కరీముల్లా, గొర్రె రాజేశ్, చలిగంటి వెంకట్, సంగిశెట్టి గోపాల్, ఉపేందర్ పాల్గొన్నారు.