న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ వ్యాఖ్యానాన్ని పునః పరిశీలించాలని కోరుతూ సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్ట్ సోమవారం విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మూడింట రెండు వంతుల మంది వేరే పార్టీలోకి విలీనం కావడం ద్వారా అనర్హత వేటును తప్పించుకొనేందుకు పదో షెడ్యూల్లోని ఒక నిబంధన వెసులుబాటును కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను పునః పరిశీలించాలని సిబల్ కోరారు.