నిజామాబాద్, నవంబర్ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ స్టాపబుల్ గందరగోళం కొనసాగుతోంది. సోమవారం రోజంతా నాటకీయత చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పు అనంతరం పరిపాలన విభాగానికి వచ్చిన వీసి, రిజిస్ట్రార్లు గంటల కొద్దీ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు పర్యావసానాలపై వీరు ఇద్దరు చర్చించినట్లుగా అంతా భావిస్తున్నారు. వీరితో రద్దు కాబడిన పలువురు ప్రొఫెసర్లు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో రిక్రూట్ కాబడిన వారిలో ఐదుగురు ఆచార్యులు నేరుగా వీసీ ఛాంబర్‌కు వెళ్లి సమావేశమైనట్లుగా టీయూ వర్గాలు చెబుతున్నాయి.
వారం రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో డిచ్పల్లిలోని మెయిన్ క్యాంపస్, జంగంపల్లిలోని సౌత్ క్యాంపస్‌లో గుంభన వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై లోతైన చర్చ నడుస్తోంది. ఎవరికి వారు న్యాయపరమైన అంశాలు, ఎదురయ్యే చిక్కులు, సమస్యలపై మాట్లాడుకుంటుండటం కనిపించింది. ఏకంగా 45 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకమే రద్దు చేయడంతో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో పలు విద్యార్థి సంఘాలు రంగ ప్రవేశం చేశాయి. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తున్న వీసీ, రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలిపగా 2012 నియామకాల్లో చేరిన వారిని కొనసాగించాలంటూ ఎన్ఎస్యూఐ ఆందోళన చేసి నిమిషాల వ్యవధిలోనే నాలిక మడత వేసింది. ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పు అమలుపై అదే సస్పెన్స్ కొనసాగుతోంది.

కలెక్టర్ చెంతకు టీయూ పంచాయతీ…
టీయూలో 2012 నోటిఫికేషన్ల అంశంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వ పెద్దల దృష్టికి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు దురుద్దేశంతో నోటిఫికేషన్లను రద్దు చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్న వీసీ, రిజిస్ట్రార్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బి) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. దొడ్డి దారిలో రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా నియామకైన వారికి టీయూలో కొంత మంది పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. టీయూ వ్యవహారంపై ప్రజావాణిలో ఫిర్యాదు నమోదు కావడంతో కలెక్టర్ తీసుకునే చర్యలపై ఆసక్తి ఏర్పడింది. తనకు వచ్చిన ఫిర్యాదును సంబంధిత శాఖకు బదిలీ చేయడంతో పాటుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లనున్నట్లుగా తెలిసింది.
టీయూ వ్యవహారం గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిగ్గా కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక అవినీతి కంపుతో చర్చనీయాంశం అవుతూనే పరువును పోగొట్టుకుంటోంది. తాజాగా 2012 నోటిఫికేషన్లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువడటంతో సందిగ్ధత ఏర్పడింది. 11 రోజుల క్రితమే తీర్పు వచ్చినప్పటికీ ఈ అంశంలో టీయూ పాలకవర్గం, టీయూ వీసీ, రిజిస్ట్రార్లు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ tshc.gov.in జస్టీస్ నగేశ్ భీమపాక పేరుతో వెలువడిన జడ్జిమెంట్ జాబితాలో టీయూ తీర్పు పొందుపర్చబడి ఉంది. దేశ, విదేశాల్లో ఉన్న అనేక మంది టీయూ పూర్వ విద్యార్థులు, మేధావులు, ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ తీర్పును డౌన్లోడ్ చేసి అధ్యయనం చేయడం గమనార్హం.
ఆందోళనకు ఉసిగొల్పి..బొక్కా బోర్లపడి..
తెలంగాణ యూనివర్సిటీలో ఆది నుంచి వర్గ విభేదాలు తారాస్థాయిలో కొనసాగడం పరిపాటిగా మారుతున్నదే. కుల రాజకీయాలతో పాటుగా నిత్యం అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలతో టీయూ రచ్చకెక్కడం నిత్యం జరుగుతున్నదే. అయితే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ పేరు చెప్పుకుని కొంతమంది విద్యార్థులు సోమవారం ఆందోళన చేశారు. ఎన్ఎస్యూఐ జెండాలు పట్టుకుని 2012 నోటిఫికేషన్లలో రద్దు కాబడిన వారినే తిరిగి చేర్చుకావాలని, వారినే కొనసాగించాలని వీరంతా డిమాండ్ చేశారు. కొద్దినిమిషాల్లోనే ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్ కీలక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ పేరుతో చేసిన ఆందోళనతో తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. టీయూకు ఎన్ఎస్యూఐ కమిటీయే లేదని చెప్పారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారి తీరును ఖండిస్తున్నట్లుగా చెప్పారు. ఈ పరిణామాలు తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. అధికార పార్టీ విద్యార్థి విభాగం ఆందోళనపై నిఘా వర్గాలు రంగ ప్రవేశం చేసి సమాచారం సేకరించింది. నిరసన వెనుకాల కొంత మంది ప్రొఫెసర్ల పాత్ర ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. మొత్తానికి సదరు ఆచార్యుల తీరుపై సర్వత్రా చర్చ జరిగింది. ఆందోళనకు ఉసిగొల్పి నిమిషాల్లోనే బొక్కా బోర్లా పడ్డట్లుగా పలువురు చర్చించుకున్నారు.