హైదరాబాద్ : ఇరాన్‌పై దాడులు(Iran war) కొనసాగిస్తామని ఇజ్రాయెల్(Israelప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్‌లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే జరిపిన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి అమీర్, ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్(Revolutionary Guards commander) కమాండర్ మహ్మద్ పాక్‌పౌర్ కూడా మృత్యువాత పడ్డారు.
దీంతో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు ఇరాన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైపు ప్రకటిస్తుండగా ఇరాన్ పై ఇంకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇరాన్‌లోని 30కి పైగా స్థావరాలను లక్ష్యాలుగా చేసుకున్నాం. మా లక్ష్యాల్లో ఆ దేశం వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు, ఇరాన్ పాలకులు, సైనిక కమాండ్ కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
ఇరాన్ ప్రతికార దాడులు..
ఇరాన్ మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యపై మండిపడుతున్నది. ఖమేనీ మృతిని ఇరాన్ కేబినేట్ తీవ్రంగా ఖండించింది. ఆయన మరణం మహా నేరంగా అభివర్ణించింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది. ప్రతీకారేచ్ఛతో రగలిపోతున్న ఇరాన్ అందులో భాగంగా ఇజ్రాయెల్ నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. జెరూసలెంపై దాడులతో ఆదేశ ఉత్తర ప్రాంతంలో సైరన్ శబ్దాలు మోగించి అలర్ట్‌గా ఉండాలని ఇజ్రాయెల్ పౌరులకు సూచించింది. కొన్ని డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది.
అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్..
ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నది. దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్, అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్‌బేస్, దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ (యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం), సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్- ఇలా అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఇరు దేశాలు పరస్పర భీకర దాడులకు పాల్పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి.