Musi Dandi March | మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శన చేశారు. అయితే బాధితులు చేపట్టిన ఈ మూసీ దండి మార్చ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడిన భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మూసీ బాధితుల పక్షాన ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేవలం ఇండ్లు పోతున్న వాళ్లు మాత్రమే కాకుండా.. మిగిలిన ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా సంఘీభావంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. లేదంటే ఈ రోజు వాళ్ల ఇల్లు, ఆ తర్వాత మిగిలిన వారి ఇళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తుందని అన్నారు.
పేదల ఇండ్లను కూల్చడం తగదని కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ హితవు పలికారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని సూచించారు. మూసీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు, కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని అన్నారు. బుల్డోజర్ల భయం నీడలో బతుకుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేదల పొట్ట కొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతి ఇంటికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.