Samantha | దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన పట్టుదలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజాగా జిమ్‌లో చేసిన వర్కవుట్ వీడియోలో ఏకంగా 150 కేజీల బరువును ఎత్తి ఫిట్‌నెస్‌పై తన నిబద్ధతను చాటుకుంది. మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, తన శారీరక సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్న సమంతను చూసి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డెడ్‌లిఫ్ట్, లెగ్ ప్రెస్ వంటి వ్యాయామాలతో తన థై, కోర్ బలాన్ని పెంపొందించుకుంటున్న సమంత స్టాటిస్టిక్స్ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం థై స్ట్రెంగ్త్ ఆధారంగా 150 కేజీల బరువును సునాయాసంగా లిఫ్ట్ చేయడం సాధారణ విషయం కాదు
ఫిట్నెస్ విషయంలో ఆమె చూపిస్తున్న క్రమశిక్షణకు “ఫిట్నెస్ ఫ్రీక్” అనే బిరుదు సరైనదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిట్నెస్ వీడియోతో పాటు సమంత తన 16 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. ఆమె కథానాయికగా పరిచయమైన ఏ మాయ చేశావే చిత్రం 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. ఆ రోజుతో ప్రారంభమైన ప్రయాణం నేటికి పదహారేళ్లు పూర్తి చేసుకుంది. ‘జెస్సీ’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఆమె, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది.
“16 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ నటనపై ఉన్న ఆకలి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది” అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. 2017లో తన స్నేహితురాలు క్రెషా బజాజ్ ఊహించిన ఎన్నో విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. సినిమాలకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తగా కూడా తనను నిరూపించుకోవాలని సమంత సంకల్పించింది. తన సొంత బ్రాండ్ ‘ట్రూ స్మా’ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. ఎంత బిజీగా ఉన్నా ఫిట్‌నెస్‌లో రాజీ పడకుండా పికిల్ బాల్ ఆడటం, జిమ్‌లో కష్టపడటం తనకు అసలైన ఆనందమని చెప్పింది. తన విజయాల వెనుక కష్టపడే టీమ్ ఉందని, షూటింగ్ సెట్లు తనకు “హ్యాపీ ప్లేస్” అని సమంత పేర్కొంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా దేవుడిపైనా, తన ఆత్మవిశ్వాసంపైనా నమ్మకం తనను ముందుకు నడిపిస్తోందని భావోద్వేగంగా రాసుకొచ్చింది. వయస్సు పెరుగుతున్నా మనసులో ఎప్పుడూ చిన్నపిల్లలా ఉండటమే తన ప్రత్యేకత అని తెలిపింది.