నిజాంసాగర్, నవంబర్ 10: నిజాంసాగర్ ప్రాజెక్టుకు మూడు నెలలపాటు భారీగా వరద వచ్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరాలోకి నీటిని విడుదల చేశారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని అచ్చంపేట, మాగి, గోర్గల్, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, మర్పల్లి, లింగంపల్లి తదితర గ్రామాల శివారులో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. మంజీరాలో వేసిన ఇసుక మేటలను తరలించేందుకు మాగి గ్రామానికి చెందిన కొందరు సోమవారం జేసీబీ సహాయంతో పెద్ద పైపులు వేసి, మట్టిని పోస్తూ ఇరువైపులా ట్రాక్టర్లు వెళ్లేలా దారి ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న అచ్చంపేట గ్రామస్తులు తమ శివారులో దారి ఏర్పాటు చేస్తున్నారంటూ అడ్డుకున్నారు. ఆ ప్రాంతం తమది అంటే తమదంటూ వాగ్వాదానికి దిగి.. విషయాన్ని తహసీల్దార్‌కు చేరవేశారు. వెంటనే తహసీల్దార్ భిక్షపతి ఘటనా స్థలానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను పంపించారు. దారి ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించిన గ్రామ పరిపాలన అధికారి సంగమేశ్వర్‌రెడ్డి.. అది ఇరుగ్రామాల సంది కట్టుగా గుర్తించారు. విషయాన్ని తహసీల్దార్‌కు తెలిపారు. దీంతో తహసీల్దార్ విషయాన్ని పోలీసులకు అందించి.. పనులు నిలిపివేయించారు. ఇరు గ్రామాల ప్రజల అల్లర్లకు పాల్పడకుండా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బందోబస్తు నిర్వహించారు.