నిజాంసాగర్, నవంబర్10: గురుకుల పాఠశాల విద్యార్థులకు సోమవారం కిచిడీతోపాటు టమాట చట్నీ అందించాల్సి ఉన్నది. కాగా మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాల విద్యార్థులతో నీళ్ల చారుతో భోజనం వడ్డించారు. చారు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కడుపుకే భోజనం చేసి మిగిలిన అన్నం చెత్త బుట్టలో పారవేశారు. ఈ విషయం అధికారులు పాఠశాలను తనిఖీ చేయగా.. వెలుగు చూసింది. అచ్చంపేట గురుకుల పాఠశాలను ఎంపీడీవో శివకృష్ణ, ఎంఈవో తిరుపతిరెడ్డి సోమవారం సందర్శించారు. పాఠశాలలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం దర్శనమిచ్చింది.
కంపు కొడుతున్న మరుగుదొడ్లతోపాటు ఇడ్లీ, దోశ పాత్రలు తుప్పు పట్టి ఉండడం చూసి అధికారులు అవాక్కయ్యారు. గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులు, స్టోర్, మెస్ ఇన్చార్జిలు విధులు నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని అధికారులు తెలిపారు. కిచిడీకి బదులు నీళ్ల సాంబారు అందించారని, మధ్యాహ్నం చికెన్ వడ్డించాల్సి ఉండగా.. అది విద్యార్థులందరికీ సరిపోయేలా లేదని అధికారులు అనుమానం వ్యక్తంచేశారు. గురుకులంలోని పరిస్థితులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపీడీవో, ఎంఈవో తెలిపారు.

Nizamabad4