MLA Vemula Prashant Reddy | భీంగల్, జనవరి 17: భీంగల్ ఎల్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భీంగల్ పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే మన పార్టీ బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 40 పైగా సర్పంచులను, ఏడు మండల కేంద్రాల్లో ఐదు మండల కేంద్రాల సర్పంచ్‌లను మనమే గెలిపించుకున్నామని, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం రాకముందు భీంగల్ మురికి కాలువలు, చెడిపోయిన రోడ్లు, అపరిశుభ్రతతో ఉండేదని, తాను పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో భీంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
భీంగల్‌లో ఇంటింటికి నల్లానీరు..
కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే భీంగల్‌ను మున్సిపాలిటీగా మార్చగలిగామని, మున్సిపాలిటీగా ఏర్పడిన వెంటనే కేటీఆర్ ద్వారా రూ.35 కోట్ల నిధులు రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి మంజూరు చేయించామని తెలిపారు. అదేవిధంగా ఆర్అండ్బీ శాఖ ద్వారా సెంట్రల్ లైటింగ్, డివైడర్ల కోసం మరో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు నిధులు తీసుకురాగలిగామని చెప్పారు. ప్రతి వెయ్యి ఓట్లు ఉన్న వార్డుకు సుమారు రూ.6 కోట్ల వరకు నిధులు కేటాయించేలా అభివృద్ధి చేశామని వివరించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా భీంగల్‌లో ఇంటింటికి నల్లనీరు అందించామని, రూ.35 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, రైతుల కోసం చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి కారణంగానే భీంగల్ మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు మనకే ఉందన్నారు.
సగంలోనే వెజ్–నాన్ వెజ్ మార్కెట్ పనులు..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మనం మంజూరు చేసిన నిధులతో పనులు కూడా పూర్తి చేయడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేయకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే రూ.3 కోట్లతో చేపట్టిన వెజ్–నాన్ వెజ్ మార్కెట్ పనులను సగంలోనే నిలిపివేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ నాయకులతో పంచించారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారంటీలను పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను రూపొందించిందని, ఈ కార్డుల ద్వారా గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఎంత బాకీ పడిందో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
రూ.2500 చేయూత పెన్షన్, రూ.4000 ఆసరా పెన్షన్ పెంపు, తులం బంగారం, విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాలు, 4000 నిరుద్యోగ భృతి, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా రూ.15,000, ప్రత్తి పంటకు రూ.500 బోనస్ వంటి అనేక హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈ బాకీ కార్డును చూపించి, హామీలు నెరవేర్చితేనే ఓటు వేస్తామని, లేకపోతే ఓడిస్తామని ప్రజలు స్పష్టంగా చెప్పాలని పిలుపునిచ్చారు.
పార్టీలో టికెట్లు ఆశించే వారు ఎంతమంది ఉన్నా, ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొంకంటి నర్సయ్య, ఎక్స్ జెడ్పిటిసి రవి, ఎక్స్ ఎంపిపి మహేష్, PACS చైర్మన్ శివసారి నర్సయ్య, జిల్లా కో అప్షన్ మొయీజ్, పసుల ముత్తేన్న, శర్మ నాయక్, మాణిక్యాల శ్రీనివాస్,తుక్కజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!