Sunita Ahuja | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందాతో పాటు అతడి భార్య సునీత అహుజా గత ఏడాది కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని, త్వరలోనే విడిపోబోతున్నారని గత ఏడాది నుంచి వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. గోవిందాకు ఉన్న అక్రమ సంబంధాల వలనే ఈ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై తాజాగా స్పందించింది గొవిందా భార్య సునీత. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్న సునీత అందులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
గోవిందాను ఉద్దేశించి సునీత మాట్లాడుతూ.. జీవితంలో ఇలాంటి అమ్మాయిలు ఎందరో వస్తుంటారు పోతుంటారు కానీ నీకు 63 ఏళ్లు వచ్చాయి, కాస్త విజ్ఞతతో ఆలోచించు. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. కూతురు టీనాకు పెళ్లి చేయాలి, కొడుకు యష్ కెరీర్ గురించి ఆలోచించాలి. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను నేపాల్‌కు చెందిన బిడ్డనని గుర్తు చేస్తూ ఒకవేళ తాను ఖుక్రీ (నేపాలీ కత్తి) తీశానంటే అందరి పరిస్థితి దారుణంగా ఉంటుందని అందుకే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని గోవిందాను ఘాటుగా హెచ్చరించింది. కుటుంబ బాధ్యతల విషయంలో కూడా సునీత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. తన కుమారుడు యష్‌వర్ధన్ కెరీర్ విషయంలో గోవిందా ఏమాత్రం సహాయం చేయడని తెలిపింది. యష్ తన తండ్రిని ఎప్పుడూ సాయం అడగలేదు, గోవిందా కూడా తనంతట తానుగా కొడుకు కోసం ఏమీ చేయలేదు. అసలు నువ్వు తండ్రివేనా? అని నేను ఆయన ముఖం మీదే అడిగేశాను అని ఆమె పేర్కొంది.
1987లో వివాహం చేసుకున్న ఈ జంటకు టీనా, యష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిబ్రవరి నుంచి వీరి విడాకుల పుకార్లు వినిపిస్తున్నప్పటికీ, వినాయక చవితి వేడుకల్లో ఇద్దరూ కలిసి మీడియాకు ఫోజులిచ్చి అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సునీత ఇప్పటికే సెపరేషన్ నోటీసులు పంపినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఇటీవల గోవిందా ఇంట్లో కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి సునీత మాట్లాడుతూ.. తనకు ఈ విషయం ఆయన ఇంటర్వ్యూ చూసే వరకు తెలియదని తెలిపింది.