జూలూరుపాడు, మార్చి 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ (CCS) సిబ్బంది సంయుక్తంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు 105.54 కిలోల గంజాయి పట్టుబడింది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 52,77,000/- ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గంజాయి ముఠాను పట్టుకున్న తీరును ఆయన వివరాలను వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్నారనేవిశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జూలూరుపాడు పోలీసులు, సీసీఎస్ (CCS) సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా TS11 ER 6312, TS07 JY 3959 అనే నంబర్లున్న రెండు కార్లను పోలీసులు ఆపారు. ఆ కార్లలో సోదాలు చేయగా దాచి ఉంచిన 52 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. కార్లలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా.. ఆంధ్ర రాష్ట్రంలోని కలిమెల, డొంకరాయి ప్రాంతాల నుండి గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. ఈ గంజాయి పొట్లాలను భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా హైదరాబాద్కు తరలించి విక్రయించాలని చూశామని వీరు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్ (35), బైరెడ్డి భార్గవ్ (30), రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన అందేకర్ శ్రీనివాస్ (40)లు కార్లలో గంజాయి తరలిస్తూ పట్టబడ్డారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు అబి, లక్ష్మణ్, ఫారుక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. 2025 జనవరి నుండి ఇప్పటివరకు జిల్లాలో 86 కేసుల్లో సుమారు రూ. 34 కోట్ల రూపాయల విలువైన 68,44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ

ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసి, వారి ఆస్తులను జప్తు చేశామని.. త్వరలోనే మరికొందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.
ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ, ఎస్ఐ బాదావత్ రవి, ఏఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.