బూర్గంపహాడ్, ఆగస్టు 14 : తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తుడు ఒక్కడే జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సంఘటన శుక్రవారం బూర్గంపహాడ్‌లో చోటుచేసుకుంది. బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర ప్రధాన రహదారిపై గ్రామస్తుడు ఒక్కడే తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, మంచినీరు రాకపోవడంతో ప్రజలు సుదూర ప్రాంతానికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాకాలం వచ్చినా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డుకు అడ్డంగా |డ్రమ్ములు, వాటర్ క్యాన్లు పెట్టి ఆందోళనతో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, ఇప్పటికైనా స్పందించి తాగునీటి సరఫరా సక్రమంగా చేసి నీటి కష్టాలను తీర్చాలని కోరాడు.
ఈ విషయమై మిషన్ భగీరథ(ఇంట్రా) ఏఈ వసంతను ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా ధర్నా విషయం తన దృష్టికి రాలేదని, గత మూడు రోజులుగా మిషన్ భగీరథ కార్మికులు సమస్యలపై అశ్వాపురం రథంగుట్ట వద్ద ధర్నాకు దిగడంతో మంచినీటి సరఫరాకు మండలంలో అంతరాయం ఏర్పడిందన్నారు. కార్మికుల సమ్మెకు సంబంధించి చర్చలు సఫలం కావడంతో గురువారం రాత్రికి వాటర్ ట్యాంకుల్లో నింపడం జరిగిందని, శుక్రవారం మండలంలోని గ్రామాల్లో మంచినీటి సరఫరా చేసినట్లు వివరణ ఇచ్చారు.