కామారెడ్డి: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవో (MPDO), ఎంపీవోలను (MPO) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు స్వీకరణ ప్రక్రియలో నివేదికలను తారుమారు చేశారు. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పించడంతో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వివరణ కోరగా సంబంధిత మండలానికి చెందిన ఎంపీడీవో, ఎంపీవోలు సరైన సమాధానం ఇవ్వకపోగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో ప్రభాకర చారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.