నిజామాబాద్, డిసెంబర్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవు. గత వానాకాలం సీజన్లో పూర్తి స్థాయిలో నగదు సాయం చేసినప్పటికీ పూర్వపు సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కాంగ్రెస్ సర్కారు మరిచి పోయింది. ఆ ఊసే ఎత్తడం లేదు. రైతులకు యాసంగి పెట్టుబడి సాయాన్ని ఇప్పటికే జమ చేయాల్సి ఉంది. సాయం వస్తుందా? రాదా? అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
కేసీఆర్ పాలనలో సమయానికి పెట్టుబడి సాయం వచ్చేదని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు దుర్భర స్థితి ఏర్పడిందని వాపోతున్నారు. యాసంగి పంట కాలంలో వరి పంటకు మినహా మిగిలిన పంటలకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడుతోందన్న చర్చ జోరుగా నడుస్తోంది. సాగు భూములకే సాయం చేస్తామంటూ మరో ప్రచారానికి సర్కారు ఎగబడుతోంది. ఇలా పూటకో రకమైన ప్రచారాలతో రైతులను ముప్పుతిప్పలకు గురి చేస్తూ కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు ఏటా రూ.15వేలు చొప్పున రైతుభరోసా అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వానాకాలంలో ఎన్నికల డ్రామా..
2025-26 వానాకాలం సీజన్లో జూలై మాసంలో రైతు భరోసా అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయనే ఆలోచనతో ప్రభుత్వం ఠంచనుగా పెట్టుబడి సాయాన్ని అందించింది. అంతకు ముందు రెండు పర్యాయాలు రైతు భరోసా ఎగ్గొట్టింది. మొన్నటి వానాకాలం సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 72వేల 589 మంది రైతులకు ఎకరాకు రూ.6వేలు చొప్పున రూ.316కోట్లు మేర చెల్లింపులు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో 3లక్షల 3వేల 568 మంది రైతులకు ఎకరాకు 6వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని రూ.305.98కోట్లు జమ చేశారు. హైకోర్టు ఆదేశాలతో స్థానిక పోరు జరుగుతుందనే ముందస్తు వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఒక వేళా రైతుల సంక్షేమంపై సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే 2023-24 యాసంగి, 2024-25 వానాకాలం, యాసంగి బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ మూడో వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సాకుతో రైతులకు మొండి చేయి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కోడ్‌ను బూచీగా చూపి రైతులకు అందివ్వాల్సిన రైతు భరోసా నగదు సాయాన్ని ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలకు దిగుతోందని రైతులంతా ఆరోపిస్తున్నారు. కర్షకులపై ప్రేమ ఉంటే తక్షణం యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
రూ.15వేలు అమలు ఎప్పుడు?
ఎకరానికి ఏటా రూ.15వేలు చొప్పున సాయం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తప్పించుకుంటోంది. ఇచ్చిన మాట ఎత్తితే రైతులపైనే ఎదురు దాడికి దిగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు ఏటా రూ.10వేలుగా అమలైన పెట్టుబడి సాయాన్ని రూ.15వేలకు పెంచుతున్నట్లుగా ఎన్నికల మేనిపెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానిప్పుడు ఆ ఊసేత్తడం లేదు. గ్రామాల్లో రైతుల ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ చేసేది లేక కేసీఆర్ అందించిన రూ.10వేలు సాయానికి రూ.2వేలు అదనంగా కలిపి రూ.12వేలతో సరి పెడుతున్నారు.
ప్రతి రైతుకు ఎకరాకు రూ.3వేలు చొప్పున కోత పెట్టి రైతులను అధికార కాంగ్రెస్ పార్టీ మోసగిస్తోంది. పెరిగిన ఖర్చులు, తగ్గిన దిగుబడుల పరిస్థితిలో రైతులకు ఉపశమనం కలిగించాలంటే పెట్టుబడి సాయాన్ని ఎకరాకు సంవత్సరానికి రూ.15వేలు చొప్పున అమలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చిన్న కమతాల్లో సేద్యం చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు తగ్గిన పెట్టుబడి సాయంతో తీరని అన్యాయం జరుగుతోంది. పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోవడంతో అప్పుల్లో కూరుకు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సమయానికి పెట్టుబడి సాయాన్ని అందించకపోవడంతో కర్షకులకు కన్నీళ్లు మిగులుతున్నాయి. సర్కార్ అందించే సాయం ఎప్పుడు వస్తుందో? అన్న ఆశతో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
రైతుభరోసా ఇంకెప్పుడిస్తారు?
రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారు. సీజన్ ప్రారంభంలోనే ఇస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సీజన్‌కు రూ.6వేలకు పరిమితం చేశారు. అది కూడా సమయానికి ఇస్తే రైతుకు పెట్టుబడికి సహాయంగా ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు చెప్పిన సమయానికి ఇచ్చి రైతులు ఆండగా నిలిచారు.
-అక్కపల్లి శ్రీను, రైతు, రుద్రూర్
సీజన్ ప్రారంభంలోనే ఇవ్వాలి
పెట్టుబడి సహాయం కింద రైతులకు అందజేసే రైతు భరోసా సమయానికి అందజేస్తే పెట్టుబడికి ఆసరాగా ఉంటుంది. కానీ ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటివరకు రైతుభరోసా అందించలేదు. సకాలంలో రైతులకు అందజేయాలి.
-జెల్ల సాయిలు, రైతు, చిక్కడ్పల్లి, రుద్రూర్ మండలం