టాలీవుడ్ నటి లయ గతంలో అందుకున్న నంది అవార్డులపై నిర్మాత వంశీ నందిపాటి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. నటుడు శివాజీ, నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్ర ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లయకు వరుసగా వచ్చిన పురస్కారాలను ప్రస్తావిస్తూ “ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చెప్పుకునేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన నంది అవార్డులను పందులతో పోల్చడం పట్ల సినిమా అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే స్పందించిన వంశీ నందిపాటి, తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పారు. లయను ఉద్దేశించి సరదాగా అన్న మాటలే తప్ప, అవార్డులను తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, నోరు జారి చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.