మోర్తాడ్, డిసెంబర్ 3: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పదవుల పందేరం కొనసాగుతున్నది. సర్పంచ్, వార్డు స్థానాలకు వేలం నిర్వహిస్తుండడం కనిపిస్తున్నది. పదవులపై కన్నేసిన ఆశావహులు ఎంతకీ వెనక్కు తగ్గడం లేదు. లక్షలు వెచ్చించి మరీ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంటున్నారు. ఓ గ్రామంలో వేలం వేయగా అభ్యర్థి ఒకరు రూ.32 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, మరో గ్రామంలో 10 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.
ఆనవాయితీగా..
కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలం వేయడం ఆనవాయితీగా వస్తున్నది. వీడీసీలు, గ్రామ ప్రముఖులు, కుల పెద్దల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహిస్తుండడం చాలా ఏండ్లుగా కొ నసాగుతున్నది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వేలం పూర్తి కాగా, మోర్తాడ్ మండలంలో సర్పంచ్ పదవులకు వేలం కొనసాగుతున్నట్లు తెలిసింది. గ్రామానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే సదరు అభ్యర్థి మినహా మిగతా వారెవరు నామినేషన్లు వేయకుండా చూడడం ద్వారా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరిస్తారు. సర్పంచ్లకు గానీ, వార్డు స్థానాలకు గాని వేలం నిర్వహించవద్దని, అలా చేస్తే ఆ ఎన్నిక చెల్లదని, చట్టరీత్యానేరం అవుతుందని అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం పదవులకు వేలం కొనసాగుతుండడం విశేషం.
మూడు గ్రామాల్లో వేలం!
మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలం వేస్తున్నట్లు సమాచారం. అత్యధికంగా ఓ గ్రామ సర్పంచ్ పదవికి రూ.32 లక్షలకు వేలం పాడినట్లు తెలిసింది. ఇక, సమీపంలో మరో గ్రామంలో రూ.10లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇదే కోవలో ఇంకో గ్రామంలో కూడా వేలం కొనసాగుతున్నట్లు తెలిసింది.
ఒకవర్గం ఏకమై..?
మోర్తాడ్ మండలంలోని ఓ గ్రామంలో ఒక వర్గానికి చెంది న వారు ఏకమై రూ.11 లక్షలకు వేలం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, తాజాగా మిగతా వర్గాల వారు సమావేశమై.. వేలం నిర్వహించిన వారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామంలో వేలం కారణంగా వర్గాలుగా ఏర్పడి వివాదాలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.