Virosh | ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా అభిమానులను అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఏడేళ్ల సీక్రెట్ డేటింగ్ అనంతరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్‌లోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్ ‘ITC మెమెంటోస్’లో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహ వేడుకలు నిర్వహించడం ఈ పెళ్లి ప్రత్యేకతగా నిలిచింది. 2026 ఫిబ్రవరి 26న ఉదయం 10.10 గంటలకు శుభముహూర్తంలో విజయ్ దేవరకొండ వేదమంత్రాల నడుమ రష్మిక మెడలో తాళి కట్టారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం అయిన కొడవ శైలిలో మరోసారి వివాహ వేడుక జరిగింది. రెండు సంస్కృతుల సమ్మేళనంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వేడుకలో వధూవరుల వేషధారణతో పాటు వారు ధరించిన బంగారు, వజ్రాభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రష్మిక మెడలో రెండు భారీ హారాలు, వడ్డాణం, గాజులు, పెద్ద చెవిపోగులు ధరించి రాయల్ లుక్‌లో మెరిసింది. అంచనాల ప్రకారం ఆమె ధరించిన ఆభరణాల మొత్తం బరువు సుమారు 1.5 నుంచి 2 కిలోల వరకు ఉండొచ్చని సమాచారం. విజయ్ దేవరకొండ కూడా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ముత్యాలు, వజ్రాలతో పొదిగిన హారాన్ని ధరించాడు. చేతులకు బ్రాస్లెట్లు, వేళ్లకు వజ్రాల ఉంగరాలు ధరించి రాజసంగా కనిపించాడు. మొత్తం ఆభరణాల బరువు అర కిలో కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కిలో బంగారం ధర సుమారు రూ.75–80 లక్షల వరకు ఉండగా, సెలబ్రిటీలు ధరించే ప్రత్యేక డిజైనర్ ఆభరణాల విలువ మాత్రం మరింత ఎక్కువగా ఉంటుంది. తయారీ ఛార్జీలు, డిజైనర్ బ్రాండ్ విలువ, వజ్రాలు, పచ్చలు, కెంపులు వంటి రత్నాల ధర కలిపితే ఈ ఆభరణాల మొత్తం విలువ కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రష్మిక ధరించిన ఆభరణాల విలువ రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఉండొచ్చని, విజయ్ ధరించిన ఆభరణాలు రూ.1 నుంచి 2 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం బయటకు రాలేదు.