బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jul 09, 2020 , 02:09:54

ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారిన నదీ పరీవాహకం

ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారిన నదీ పరీవాహకం

నందిపేట రూరల్‌ : గోదావరి పరీవాహకం.. పర్యాటక ప్రాంతంగా మారింది. అందాల తీరం కనువిందు చేస్తున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో వివిధ రకాల వన్యప్రాణులు, విదేశీపక్షులు సందడి చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా జంతుజాతులు కనిపిస్తుండడంతో అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. పచ్చికబయళ్లలో సేదతీరుతూ.. వన్యప్రాణులు, పక్షులను ప్రత్యక్షంగా చూస్తూ ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వన్యప్రాణులపై వేటగాళ్లు పంజా విసిరే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. వీటి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.గోదావరి తీరం కొత్త అందాలను సంతరించుకున్నది. అరుదైన జాతి పక్షుల కిలకిల రావాలు, మయూరాల నాట్యాలు, దుప్పుల గెంతులు, కృష్ణ జింకల పరుగులతో ఆఫ్రికన్‌ అడవులను తలపించేలా గోదావరి తీరం కనువిందు చేస్తోంది. తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ పరిసరాల్లో విదేశీ పక్షులు, వన్యప్రాణాలు సందడి చేస్తున్నాయి. గోదావరి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. 

వన్యప్రాణులకు రక్షణ కరువు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిజామాబాద్‌-నిర్మల్‌ జిల్లాల్లోని నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉండగా కేవలం నిజామాబాద్‌ జిల్లాలోనే సుమారు మూడు వేల ఎకరాల్లో ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న వన్యప్రాణులకు వేటగాళ్లు, వేట కుక్కలతో ప్రమాదం పొంచి ఉంది. రాత్రి వేళల్లో వేటగాళ్లు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెడ్‌ జోన్ల ఏర్పాటు

గోదావరి తీరానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా రెడ్‌ జోన్లు ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో వన్యప్రాణులు, పక్షులు, గోదావరి జల సవ్వడిని వీక్షించేందుకు వెళ్లే వారు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెడ్‌ జోన్ల వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

నిజామాబాద్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ముంపు ప్రాం తం 3 నుంచి 4 వేల ఎకరాల్లో 10 గ్రామాలను ఆనుకొని ఉంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏడు వన్యప్రాణులు, అరుదైన జాతి పక్షులు సంచరిస్తుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి లభించి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. 

చిన్నయానం తీరానికి ఇలా వెళ్లాలి..

జిల్లా కేంద్రం నుంచి గాదేపల్లి, చిన్నయానం గ్రామాల శివారులోని గోదావరి తీరానికి 45 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రావొచ్చు. నిజామాబాద్‌ నుంచి దాస్‌నగర్‌ మీదుగా 30 కిలోమీటర్ల దూరంలో నందిపేట్‌ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శాపూర్‌ 2 కిలోమీటర్లు, తొండాకూర్‌ మీదుగా డొంకేశ్వర్‌ 6 కిలోమీటర్లు, అక్కడి నుంచి జీజీ నడ్కుడ మీదుగా గాదేపల్లి, చిన్నయానం వరకు 5 కిలోమీటర్లు, అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గోదావరి తీరం చేరుకోవచ్చు.


logo