బుధవారం 05 ఆగస్టు 2020
Nipuna-education - Jul 29, 2020 , 01:11:31

కరెంట్ అఫైర్స్

కరెంట్ అఫైర్స్

తెలంగాణ

ఇంటర్‌వర్క్‌ అలయన్స్‌లో హైదారాబాద్‌

డిజిటల్‌ సమాచారాన్ని కాపీ చేయడం, మరొకరికి పంపించడం వీలుకాని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న గ్లోబల్‌ ఇంటర్‌వర్క్‌ అలయన్స్‌లో హైదరాబాద్‌ జిల్లాకు భాగస్వామ్య సభ్యత్వం జూలై 21న లభించింది. దీనివల్ల రాష్ట్రంలో పకడ్బందీ సమాచార భద్రతకు వీలవుతుంది. లాభాపేక్షలేని ఈ గ్లోబల్‌ ఇంటర్‌వర్క్‌ అలయన్స్‌ సంస్థను గత నెల జూన్‌లో అమెరికాలో ప్రారంభించారు.

ఐజీఎస్టీ పరిష్కార కమిటీ సభ్యుడిగా హరీశ్‌రావు

- సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్టీ) పరిష్కారం కోసం జీఎస్టీ పాలకమండలి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావును నియమిస్తూ కేంద్ర జీఎస్టీ మండలి జూలై 22న ఉత్తర్వులు జారీచేసింది. ఐజీఎస్టీ పరిష్కారం కోసం 2019, డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీని తాజాగా పునర్‌వ్యవస్థీకరించారు. ఈ కమిటీకి బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.  

జాతీయం

గోధన్‌ న్యాయ్‌ యోజన ప్రారంభం

రైతుల నుంచి కిలో రూ.2కు ఆవు పేడ కొనుగోలు చేసే ‘గోధన్‌ న్యాయ్‌ యోజన’ కార్యక్రమాన్ని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగల్‌ జూలై 20న ప్రారంభించారు. సేకరించిన ఆవుపేడతో వర్మీ కంపోస్టు తయారుచేసి రైతులకు అందిస్తారు. దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతోపాటు పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులకు లాభాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది.  

చైనాపై నిఘాకు స్వదేశీ డ్రోన్‌

డీఆర్‌డీవో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘భారత్‌' అనే డ్రోన్‌ను తూర్పు లద్దాఖ్‌లో నిఘాకు ఉపయోగించనున్నట్లు ఆర్మీ అధికారులు జూలై 21న వెల్లడించారు. ఈ డ్రోన్‌ను చండీగఢ్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (టీఆర్‌బీఎల్‌) అభివృద్ధి చేసింది.

దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రథమంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌'ను ఆగస్టు 5 నుంచి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మల్య జూలై 22న వెల్లడించారు. ఈ రైలును ఆర్నెళ్లపాటు పైలెట్‌ ప్రాజెక్టు కింద నడపనున్నారు. కొత్త విధానం చిన్న, మధ్య తరహా వినియోదారులకు ప్రయోజనం కలిగిస్తుందని గజానన్‌ వెల్లడించారు.

ఆర్మీలో మహిళా అధికారుల కమిషన్‌

ఇండియన్‌ ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ జూలై 23న ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు పరిమిత కాలవ్యవధితో కూడిన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద మాత్రమే మహిళా అధికారులకు అవకాశం ఉండేది. ఆర్మీ రిక్రూట్‌ చేసే మహిళ అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ 2020, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు మహిళా అధికారులకు న్యాయ, విద్య విభాగాల్లో మాత్రమే శాశ్వత కమిషన్‌ దక్కేది. ఇకపై ఆర్మీలోని గగనతల రక్షణ, సిగ్నల్స్‌, ఇంజినీరింగ్‌, సైనిక వైమానిక సర్వీస్‌, ఎలక్ట్రానిక్స్‌-మెకానికల్‌ ఇంజినీర్స్‌, ఆర్మీ సర్వీస్‌ కోర్‌, ఆర్మీ ఆర్డినెన్స్‌ కోర్‌, ఇంటెలిజెన్స్‌ కోర్‌లలోనూ పదవీ విరమణ వరకు సేవలందించే అవకాశం లభిస్తుంది.

కాక్రపార అణువిద్యుత్‌ ప్లాంట్‌

గుజరాత్‌లోని కాక్రపార అణువిద్యుత్‌ కేంద్రం 3వ ప్లాంట్‌ను జూలై 22న ప్రారంభించారు. 700 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 1993లో ఈ ప్లాంట్‌ తొలిసారిగా అణువిద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 22 అణు విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌, రష్యాల నుంచి యురేనియం దిగుమతి అవుతుంది.

ధ్రువస్త్ర క్షిపణి

ఒడిశాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ రేంజ్‌ నుంచి యాంటీ గైడెడ్‌ క్షిపణిని జూలై 22న విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణికి ధ్రువస్త్రగా పేరు మార్చారు. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌లో అమర్చిన 3వ తరం యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణి హెలీనా. క్షిపణి వ్యవస్థ ప్రత్యక్ష హిట్‌, దాడి మోడ్‌లలో లక్ష్యాలను నిమగ్నం చేయగలదు.   

వృక్షారోపన్‌ అభియాన్‌

హోంమంత్రి అమిత్‌ షా వృక్షారోపన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని జూలై 23న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 38 జిల్లాల్లోని 130 నియోజకవర్గాల్లో ప్రారంభించారు. కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బొగ్గు తవ్విన ప్రదేశాల్లో మొక్కలను నాటడం ద్వారా పచ్చని ప్రదేశాలను సృష్టించడం, 70 హెక్టార్లలో గడ్డిభూమిని, 90 హెక్టార్లలో హైటెక్‌ సాగు, 3 హెక్టార్లలో వెదురుతోటల పెంపకం దీని లక్ష్యం.

అంతర్జాతీయం

దక్షిణ కొరియా శాటిలైట్‌

దక్షిణ కొరియా తన మొదటి సైనిక సమాచార శాటిలైట్‌ అనసిస్‌-2ను జూలై 20న విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని యూఎస్‌ఏ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అభివృద్ధి చేసిన ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా పంపించారు.

అమెరికా-ఇండియా వాణిజ్య సంబంధాలు

అమెరికా-ఇండియా వాణిజ్య సంబంధాలు (యూఎస్‌ఏ-ఐబీసీ) బలపడి 45 ఏండ్లు అయిన సందర్భంగా జూలై 22, 23న ఇండియా ఐడియాస్‌ సదస్సును ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ‘బిల్డింగ్‌ బెటర్‌ ఫ్యూచర్‌' అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహించారు. ఇండియా-అమెరికా ప్రభుత్వ విధానకర్తలు మైక్‌పాంపియో, నిక్కీ హేలి, ఎస్‌ జయశంకర్‌ ఈ సదస్సులో పాల్గొన్నారు.

చైనా తియాన్వెన్‌-1 ప్రయోగం

అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు చైనా రోవర్‌ను జూలై 23న విజయవంతంగా ప్రయోగించింది. దీనికి ‘తియాన్వెన్‌-1’ అనే పేరుపెట్టారు. లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా హైనాన్‌ దీవిలోని వెన్‌చాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది 2021, ఫిబ్రవరిలో అంగారక గ్రహాన్ని చేరుతుంది. ఈ వ్యోమనౌకలోని రోవర్‌ బరువు 200 కిలోలు.

క్రీడలు

హామిల్టన్‌కు గ్రాండ్‌ ప్రి టైటిల్‌

బ్రిటన్‌ స్టార్‌ ఫార్ములా వన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ జూలై 20న నిర్వహించిన హంగేరియన్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను సాధించాడు. అతడు ఈ టైటిల్‌ను సాధించడం 8వ సారి. మొత్తం 86 గ్రాండ్‌ ప్రి టైటిళ్లు సాధించాడు. అత్యధికంగా 91 టైటిళ్లను మైకేల్‌ షూమాకర్‌ సాధించాడు.  

డబ్ల్యూఎల్‌ఎఫ్‌లో ఐఎస్‌ఎల్‌

ప్రీమియర్‌ లీగ్‌, లా లిగా, బుండస్‌ లిగా లాంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌లు ఉన్న ప్రపంచ లీగ్స్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఎల్‌ఎఫ్‌)లో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌కు జూలై 21న చోటు లభించింది. దీంతో దక్షిణాసియా నుంచి ఈ అవకాశం దక్కించుకున్న తొలి లీగ్‌గా ఐఎస్‌ఎల్‌ నిలిచింది. ఆసియా నుంచి డబ్ల్యూఎల్‌ఎఫ్‌లో చేరిన ఏడో లీగ్‌ అది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 క్లబ్బులకు దాంట్లో ప్రాతినిథ్యం ఉంది.

భారత్‌కు అదనపు స్వర్ణం

ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా-2018 క్రీడల్లో భారత్‌ స్వర్ణ పతకాల జాబితాలో అదనంగా మరొకటి చేరిందని క్రీడా అధికారులు జూలై 23న వెల్లడించారు. నాటి పోటీల్లో 4X400 మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్లో బహ్రెయిన్‌ 3 నిమిషాల 11.89 సెకన్లతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించింది. 3 నిమిషాల 15.71 సెకన్లతో భారత బృందం రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. బహ్రెయిన్‌ జట్టులో సభ్యుడైన కెమిఅడికోయా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. అతడిపై అథ్లెటిక్స్‌ ఇంటిగ్రిటీ యూనిట్‌ నాలుగేండ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్‌క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు.  

వార్తల్లో వ్యక్తులు

ఐయూఆర్‌ వైస్‌ చైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌

ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ రైల్వే వైస్‌చైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌ నియమితులయ్యారని చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ జూలై 22న ప్రకటించారు. 1922లో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ రైల్వేను స్థాపించారు. 51 సభ్యదేశాలతో ఏర్పడింది. ప్రస్తుతం 194 మంది సభ్యులు ఉన్నారు.

గ్రెటా థన్‌బెర్గ్‌కు అవార్డు

పర్యావరణ విభాగంలో పోర్చుగల్‌ దేశం ఇచ్చే గుల్సెంకియన్‌ హ్యుమానిటీ అవార్డు గ్రెటా థన్‌బెర్గ్‌ జూలై 22న అందుకున్నారు. ఈ అవార్డు కింద 1.15 మిలియన్‌ డాలర్ల నగదును అందజేశారు. 

సాహిల్‌ సేథ్‌

బ్రిక్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇంటస్ట్రీ (బ్రిక్స్‌ సీసీఐ) కోసం నియమించిన స్టీరింగ్‌ కమిటీ గౌరవ సలహాదారుగా ముంబైకు చెందిన కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ సాహిల్‌ సేథ్‌ జూలై 22న నియమితులయ్యారు. బ్రిక్స్‌ సీసీఐని వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2012లో స్థాపించారు. 

అబ్బాస్‌, జయంత్‌లకు అవార్డు

ది అమెరికన్‌ సొసైటీ ఫర్‌ ఇన్వెస్టిగేటివ్‌ పాథాలజీ 2021కు ప్రకటించిన మెరిటరియస్‌ అవార్డులను ఇద్దరు భారత-అమెరికన్లకు లభించింది. డాక్టర్‌ అబుల్‌ అబ్బాస్‌, డాక్టర్‌ జయంత్‌ దేవ్‌నాథ్‌లకు ఈ అవార్డులు దక్కాయి. వీరు యూసీ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పాథాలజీలో పనిచేస్తున్నారు. 

లాల్జీ టాండన్‌ మృతి

బీజేపీ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ (85) జూలై 21న మరణించారు. ఆయన 1935, ఏప్రిల్‌ 12న లక్నో (యూపీ)లో జన్మించారు. 2009లో లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019, జూలై 20న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు 

స్వీకరించారు.


logo