న్యూఢిల్లీ : పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు జూలై నుంచి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభ, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ఇటీవల రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ తిరస్కరించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటి వరకు కమిటీలు సమావేశాలు నిర్వహించలేదు. పార్లమెంట్ సభ్యులు, సీనియర్ అధికారులు, సహాయక సిబ్బందికి టీకాలు వేయడం, యాక్టివ్ కేసులు తగ్గుతుండడంతో జూలై నుంచి తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాలు గోప్యంగా జరగాల్సి ఉందని నిబంధనలు ఉన్నాయని, వర్చువల్ విధానంలో నిర్వహిస్తే కమిటీ కార్యకలాపాలు బయటకు పొక్కే అవకాశం ఉండడంతో ఉభయ సభలు తిరస్కరించాయి.
సమావేశాల నిర్వహణపై ఓ సీనియర్ మంత్రిని సంప్రదించగా.. ‘వర్చువల్ సమావేశాలు ఉండకూడదు. ఇవి గోప్యంగా జరిగే సమావేశాలు. చాలా వరకు దేశ భద్రతకు సంబంధించినవి’ అని పేర్కొన్నారు. గోప్యత, సున్నితమైనవి కావడంతో వర్చువల్ సమావేశాలు సాధ్యం కావని ఇప్పటికే సభ్యులు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్ మహమ్మారి తగ్గే వరకు సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. ఇదిలా ఉండగా.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జై రామ్ రమేశ్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కమిటీల సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించేందుకు అంగీకరించి, డిజిటల్ ఇండియాను నిజం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు.