న్యూఢిల్లీ, జూన్ 7: రెండు నుంచి 18 ఏండ్లలోపు వారిలో కొవాగ్జిన్ టీకా ప్రభావం ఎలా ఉండనుంది అన్నదానిపై ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో ట్రయల్స్‌కు కసరత్తు మొదలైంది. పిల్లలను ఎంపిక చేయటం కోసం ఆరోగ్యపరీక్షలు ప్రారంభించారు. ఎంపికైన వారిపై టీకా ట్రయల్స్ జరుపుతారు. కొద్దిరోజుల కిందటే పాట్నాలోని ఎయిమ్స్‌లో మొదలుపెట్టిన ట్రయల్స్‌ను ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ ప్రారంభించటానికి వీలుగా ఈ కసరత్తు ప్రారంభించారు. దీంట్లోభాగంగా 525 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇంట్రామస్క్యులర్ రూట్లో తొలిరోజున ఒక డోసు, 28వ రోజున రెండో డోసు ఇస్తారు. ఈ వివరాల్ని ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ సోమవారం వెల్లడించారు. 2-18 ఏండ్లలోపు పిల్లల్లో నిర్వహించాల్సిన మూడుదశల క్లినికల్ ట్రయల్స్‌లో రెండోదశకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఏ) మే 12న అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం 18 ఏండ్లు నిండినవారు, ఆ పైన వయసున్న వాళ్లకే ఇస్తున్న విషయం తెలిసిందే.
త్వరలో నిపుణుల కమిటీ మార్గదర్శకాలు
దేశంలో కరోనా తొలి, రెండో వేవ్‌లలో పిల్లలపై అంతగా ప్రభావం పడలేదు. కానీ, కరోనా వైరస్లోగానీ, దానివ్యాప్తిలోగానీ మార్పులు వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని కేంద్రప్రభుత్వం గత వారం హెచ్చరించింది. అటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవటానికి వీలుగా సిద్ధంగా ఉండాలని, పిల్లలకు అవసరమైన చికిత్సను, ఔషధాలను, వైద్యులను సమకూర్చుకోవాలని, దవాఖానాల్లో ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు జాతీయస్థాయిలో అధ్యయనానికి ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ కమిటీ త్వరలో మార్గదర్శకాలను వెలువరిస్తుందని నీతిఆయోగ్ సభ్యుడు ఏకే పాల్ తెలియజేశారు. బ్రిటన్‌లో 12-15 ఏండ్ల పిల్లలకు వేయటానికి ఆమోదం పొందిన ఫైజర్ వ్యాక్సిన్ భారత్‌లోకి వస్తే.. అనుమతిస్తారా అన్న విలేకర్ల ప్రశ్నకు.. ‘మన టీకాలే ఉన్నాయి.. వాటిని పిల్లల కోసం సిద్ధం చేస్తున్నాం’ అని చెప్పారు. పిల్లల్లో వేయటానికి జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌పైన కూడా పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఫైజర్ టీకాకు అమెరికా, బ్రిటన్ అనుమతి
ఫైజర్/బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా టీకా 12-15 ఏండ్ల పిల్లలకు సురక్షితమేనని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ‘ది మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులరేటరీ ఏజెన్సీ’ ఇటీవల నిర్ధారించింది. కఠినమైన పరీక్షల అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని వెల్లడించింది. ఇప్పటికే ఈ టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ యూనియన్‌కు చెందిన యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ గత నెలలోనే అనుమతి ఇచ్చాయి. అమెరికాలో 12-15 ఏండ్ల వారికి ఈ టీకాను ఇవ్వటం ప్రారంభించగా.. ఈయూ దేశాల్లో ఈ నెలలో ప్రారంభం కానుంది. పిల్లల్లో ఫైజర్ టీకాను రెండుడోసులుగా ఇస్తున్నారు.