1950-60 దశకాల్లో హిందీ సినీరంగాన్ని ఏలిన దిగ్గజ నటి మధుబాల బయోపిక్ గురించి గత రెండేళ్లుగా చర్చ నడుస్తున్నది. అగ్ర కథానాయికలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఈ సినిమా పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం మధుబాల బయోపిక్ కోసం రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. టైటిల్ రోల్లో కియారా అద్వాణీ నటించనుందని తెలిసింది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు జరిపిందని, మధుబాల బయోపిక్‌లో నటించడానికి కియారా అద్వాణీ ఆనందంగా అంగీకరించిందని సమాచారం. జస్మిత్ కే రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా ప్రఖ్యాతి పొందిన మధుబాల అపురూపమైన అందం, అద్భుతాభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. ఆమె బయోపిక్ గురించి బాలీవుడ్లో పలువురు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చివరకు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా పట్టాలెక్కబోతున్నది.