e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides కమలంలో యూపీ దడ!

కమలంలో యూపీ దడ!

కమలంలో యూపీ దడ!
  • యోగి సర్కారుపై తీవ్ర అసంతృప్తి
  • కరోనా కట్టడిలో విఫలమనే వ్యాఖ్య
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ
  • ఫిబ్రవరి- మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు
  • సంఘ్‌ నుంచి ప్రమాద హెచ్చరికలు
  • ఢిల్లీలో వరుసగా వ్యూహ సమావేశాలు
  • గొంతెత్తుతున్న విపక్ష ముఖ్యమంత్రులు
  • మోదీ ఉచిత టీకా ప్రకటన నేపథ్యమిదే

అనేక రాష్ర్టాలు అనేక రోజులుగా డిమాండ్‌ చేస్తున్నా ఉచిత టీకాపై ఉలకని పలకని మోదీ.. అకస్మాత్తుగా వైఖరి ఎందుకు మార్చుకున్నారు? గత కొద్ది రోజులుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు, ఉచిత టీకా ప్రకటనకు ఏమైనా సంబంధం ఉందా? మరో 9 నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మోదీ దిద్దుబాటు చర్యలకు దిగారా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని రాజకీయవర్గాలు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో పరిస్థితి ఘోరంగా ఉన్నదనీ, ఇది రాష్ట్రంలోనూ, తర్వాత కేంద్రంలోనూ బీజేపీ విజయావకాశాలపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉన్నదనీ ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన హెచ్చరికల మేరకే మోదీ టీకాపై నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించాయి.

న్యూఢిల్లీ, జూన్‌ 7: కేంద్రంలో అధికారానికి దగ్గరి దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ కాల పరిమితి 2022 మార్చి 14తో ముగుస్తుంది. శాసనసభకు ఆరేడు దశల్లో, ఫిబ్రవరి- మార్చిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ శాసనసభలకు కూడా అప్పుడే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ప్రస్తుతం బీజేపీ దృష్టి అంతా యూపీపైనే ఉన్నది. 2017లో జరిగిన ఎన్నికల్లో యూపీలో బీజేపీ 312 సీట్లతో (మొత్తం 403) అధికారాన్ని హస్తగతం చేసుకొన్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 62 స్థానాలను సాధించింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి తిరగబడినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీలే గెలుస్తుంటాయి. కానీ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 35% సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీనికితోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొన్న తీరు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది.

గంగా ప్రవాహంలోనూ, తీరంలోనూ వేల శవాలు బయటపడటం దేశాన్ని విస్మయపరిచింది. పరిస్థితి ఏమీ బాగా లేదని, అధికారులు స్పందించడమే లేదనీ కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ (బరేలీ ఎంపీ) ఏకంగా ముఖ్యమంత్రి యోగికి లేఖ రాయగా, ‘మేం ఏం మాట్లాడగలం? ఏమైనా అంటే రాజద్రోహం కేసు పెట్టి లోపలేస్తారు’ అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రాథోడ్‌ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో బీజేపీకి ఆయువు పైట్టెన యూపీపై ఆరెస్సెస్‌ నేతలు దృష్టిపెట్టారు. సంఘ్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేతో పాటు, భయ్యాజీ జోషి, బీఎల్‌ సంతోష్‌ (జూన్‌ 1న) తదితరులు వరుసగా యూపీలో పర్యటించి, పరిస్థితి ఏమీ బాగా లేదని గ్రహించారు. దాని పర్యవసానంగా ఢిల్లీలో అటు ఆరెస్సెస్‌, ఇటు బీజేపీ ముఖ్యనేతలు విడివిడిగానూ, సంయుక్తంగానూ సమావేశమయ్యారు. మే 23న జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్‌షా హాజరయ్యారు.

జూన్‌ 3,4,5 తేదీల్లో ప్రధాన కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షులతో మరో ఉన్నతస్థాయి భేటీ జరిగింది. యూపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నదనీ, దీన్ని దిద్దుకోకపోతే అధికారం కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నదని ఇందులో చర్చ జరిగింది. ఎమ్మెల్యేల పనితీరు, దిద్దుబాటు చర్యలపై వారు సమీక్షించారు. సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనడంలో కేంద్ర, రాష్ర్టాలు విఫలమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ బహిరంగంగానే ప్రకటించారు. అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఒకవేళ యూపీ అసెంబ్లీలో దెబ్బతింటే, ఆ ప్రభావం మొత్తం ఉత్తరాది లోక్‌సభ స్థానాల మీద పడుతుందనీ, దక్షిణాదిలో కొత్తగా వచ్చేది ఏమీ లేదనీ, అందువల్ల యూపీ ఫలితం కేంద్రంలో అధికారాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని సంఘ్‌ విశ్లేషించినట్టు తెలుస్తున్నది.

సంస్థాగతంగా బలమైన పార్టీగా పేరున్న బీజేపీ, మోదీ హయాంలో వ్యక్తి కేంద్రంగా మారడం పార్టీకి నష్టం కలిగిస్తున్నదనే చర్చ కూడా జరిగింది. మోదీ పేరు తప్ప పార్టీ పేరు ఎక్కడా వినిపించడం లేదనీ, ఇది సంప్రదాయ బీజేపీ ఓటర్లను దూరం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నా అదొక్కటే చాలదు. జనంపై సంఘ్‌ ప్రభావం బలంగా కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కరోనాను ఎదుర్కొన్న తీరు అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. మొత్తమ్మీద గ్రాఫ్‌ తగ్గుతున్న మాట నిజం. దీన్ని మనం అంగీకరించాలి. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కూ 2002 డిసెంబరులో ఎన్నికలున్నాయి. గత ఎన్నికల్లోనే బొటాబొటిగా గెలిచాం. ఇప్పుడు అక్కడా పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇక యూపీలో అధికారం పోయినా ఆశ్చర్యమేమీ లేదు’ అని సీనియర్‌ నాయకుడొకరు ఈ సమావేశాల్లో కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

కమలంలో యూపీ దడ!

యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌, ప్రధాని మోదీ మధ్య పెరుగుతున్న అంతరం కూడా సంఘ్‌కు సమస్యగా మారిందని తెలిసింది. యూపీలో మోదీ అతి జోక్యాన్ని యోగి వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపుతో 75 ఏండ్ల వయసు నిబంధన అమలైతే మోదీ 2025 సెప్టెంబరు 17న వైదొలగాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మోదీ వారసుడు యోగి అని యూపీలో ఇప్పటికే భారీ ప్రచారం జరుగుతున్నది. దీనిపై మోదీ అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. యోగి పుట్టిన రోజున మోదీ కనీసం అభినందనలు తెలియజేయకపోవడం వారిద్దరి మధ్య అంతా సవ్యంగా లేదనడానికి సూచిక అని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ వ్యక్తిగత హవాతో చరిత్రలో మొదటిసారి ఆరెస్సెస్‌ కొంత బలహీనపడిందని, బీజేపీపై దానికి ఉండాల్సినంత అదుపు లేదనీ, అందువల్ల మోదీ-యోగి మధ్య అంతరాన్ని పూడ్చడం దానికీ సమస్యగానే మారిందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీ పరిస్థితి, సంఘ్‌ జోక్యం, విపక్ష ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే మోదీ తలొగ్గి, ఉచిత టీకా ప్రకటనచేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కమలంలో యూపీ దడ!

ట్రెండింగ్‌

Advertisement