భద్రాచలం, మే 30 : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు బండారు శరత్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఉపాధిహామీ కార్డులు లేనివారికి కార్డులు ఇచ్చి వంద రోజుల పని కల్పించాలని, పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వై.వెంకటరామారావు, పి.సంతోశ్‌కుమార్, డి.సీతాలక్ష్మి, తిలక్, నకిరికంటి నాగరాజు పాల్గొన్నారు.