మార్కెట్లో ప్యాక్డ్ఫుడ్ షాపింగ్ చేసేప్పుడు ట్రూత్ఇన్ యాప్‌లో బార్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు! దాని మంచి, చెడు క్షణంలో తేలిపోతుంది. తినడానికి ఏది అవసరమో అది షాపింగ్ చేసి, ఏది పడదో దానికి దూరంగా ఉండేందుకు ఈ యాప్ సాయపడుతుంది. ఈ యాప్ డాటాబేస్‌లో భారత దేశ మార్కెట్లో ఉన్న 70 వేల రకాల ఆహార ఉత్పత్తుల (ప్యాక్డ్ ఫుడ్) వివరాలు ఉన్నాయి. కొనే ముందు బార్ కోడ్‌ని స్కాన్ చేశారంటే దాని గుట్టంతా చెప్పేస్తుంది. తినబోయే ముందు రుచుల సంగతి తెలుసుకోకపోయినా ఫర్వాలేదు కానీ, ఆరోగ్య విషయం మాత్రం విస్మరించొద్దు!!
కొన్ని కంపెనీల మాటలు నమ్మి ఆహారం కొంటే జేబుతోపాటు గుండెకూ చిల్లుపడొచ్చు. సెలెబ్రిటీల ప్రమోషన్, ఆకట్టుకునే మాడల్స్ పోజులు, ఆకర్షణీయమైన ప్రకటనలు వినియోగదారుణ్ని ఆగం పట్టిస్తాయి. మిరుమిట్లు గొలుపుతూ ఊరించే పొట్లంలో ఏముందో, దాని మీద రాసిన మాటల్లో ఎంత ఉప్పుందో, ఏ ముప్పు ఉందో తెలుసుకోకుండానే కొనేస్తున్నాం, ఆబగా తినేస్తున్నాం. బిస్కెట్లు, బ్రెడ్ చాలామంది రోజూ తింటారు. కోక్ తాగుతుంటారు. ఇక అప్పుడప్పుడూ తినే చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు రకరకాల ఉత్పత్తులన్నీ ఎలా తయారయ్యాయో, తింటే మనకేమిస్తాయో తెలియకుండానే లాగించేస్తున్నాం. ఆనక అనారోగ్యంతో దోస్తీ చేస్తున్నాం. మన ఒంట్లో బాధలకు మూలం ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాం. ఈ సమస్య రావొద్దంటే స్మార్ట్ ఫోన్లో ట్రూత్ఇన్ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోండి. చిన్నప్పుడు ఇది తినొద్దు. అది తిను అంటూ అమ్మ చెప్పినట్టే, మార్కెట్లో కనిపించే రకరకాల ప్యాక్‌ల గుట్టుమట్లనీ ట్రూత్ఇన్ యాప్ చెప్పేస్తుంది!
హెల్త్ అడ్వైజర్
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏది తినాలన్నా తక్కువ షుగర్ ఉన్నదే ఎంచుకుంటారు. యాడెడ్ షుగర్ లేదని రాసుంటే రూపాయి ఎక్కువ పెట్టే కొంటారు. ఇలాంటి వాళ్ల కోసం మార్కెట్లో షుగర్ ఫ్రీ బిస్కెట్లు, స్వీట్లు, స్నాక్స్ చాలానే ఉన్నాయి. అందులో యాడెడ్ షుగర్ లేకపోవచ్చు. కానీ, ఈ తరహా కొన్ని ఉత్పత్తులు తింటే రక్తంలో యాడెడ్ షుగర్ తిన్నప్పటి కంటే షుగర్ లెవల్స్ అధికంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా మోసపోకుండా, నష్టపోకుండా ఉండాలంటే ఆయా ఆహార పదార్థాల ప్యాక్‌పైన ఉన్న బార్ కోడ్‌ని ట్రూత్ ఇన్ ద్వారా స్కాన్ చేస్తే.. ఆ ఆహారం వంద గ్రాములు తింటే ఎంత గ్లూకోజ్ వస్తుంది, అందులో ఎంత ఫ్యాట్ ఉంది.
షుగర్, సాల్ట్ ఏ మోతాదులో ఉన్నాయో చెప్పేస్తుంది. బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్లు కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తినకూడదు. రుచి కోసం జోడించిన సాల్ట్‌కు దూరంగా ఉండాలి. చిప్స్‌లో ఉండేది ఇవే. తెలియక కొన్నా బార్ కోడ్‌ని స్కాన్ చేశారంటే ఇది మీ గుండెకు పడదు బాస్ అంటూ ట్రూత్ ఇన్ చెప్పేస్తుంది. ఈ యాప్‌లో ఇప్పటి వరకు డయాబెటిస్, గుండె జబ్బులు, ఒబెసిటీ, అలర్జీ ఉన్న రోగులకు సరిపోని ఆహార పదార్థాలకు సంబంధించిన డాటా అందుబాటులో ఉంది. భవిష్యత్‌లో ఇంకా అభివృద్ధి చేస్తూ మిగతా రోగులకూ సహాయకారిగా ఈ యాప్‌ని అభివృద్ధి చేస్తామంటున్నారు మేకర్స్.
జనం అవగాహనకు తగ్గట్టే మార్కెట్లో ‘ఆర్గానిక్, నో యాడెడ్ షుగర్, షుగర్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, ప్రొటీన్ రిచ్, హై ఫైబర్’ అంటూ రకరకాల ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. అవి తింటే నిజంగా మేలు చేస్తాయో? కీడు చేస్తాయో తెలుసుకోవాలంటే బార్ కోడ్‌ని ఈ యాప్ సాయంతో స్కాన్ చేయాలి. ఆ ప్యాక్‌కు సంబంధించిన వివరాలు ఆరోగ్యానికి మేలు చేసేవి అయితే తీసుకోవడం, లేదంటే మానేయడమే మనం చేయాల్సింది!
ఇది అందరి సమస్య
నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చదువుకున్నాను. కొన్నాళ్లూ స్కూల్లో పాఠాలు చెప్పి, తర్వాత చైనాకు వెళ్లాను. కొవిడ్ సమయంలో తిరిగొచ్చాను. నాకు పిట్యూటరీ గ్రంథి దగ్గర ట్యూమర్ వచ్చింది. ఈ సమస్య ఉన్నవాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కాబట్టి ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాబట్టి ఏది కొన్నా దాని గురించి తెలుసుకోవడానికి రోజంతా వెచ్చించాల్సి వచ్చేది. సైన్స్ చదివిన నాకే ఇంత కష్టంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనిపించింది. అప్పుడే మొబైల్ అప్లికేషన్ తయారు చేయాలనే ఆసక్తి కలిగింది.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మా అన్న రాఘవతో మాట్లాడాను. తన సహకారంతో డాక్టర్ అమన్‌తో కలిసి కంపెనీ ప్రారంభించాను. మా కష్టం ఫలించింది. మా ప్రయత్నం వల్ల ఎంతోమంది ఆరోగ్యవంతమైన ఆహారం కొనుక్కునే అవకాశం దక్కింది. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ ఈ యాప్ పనితీరుని గుర్తించింది. ‘ప్రామిసింగ్ ఇన్నోవేషన్ అవార్డ్’ ఇచ్చింది. ఎన్ఐఎన్ మా డాటాబేస్ డెవలప్మెంట్కి సహకారం అందిస్తున్నది. ఈ యాప్‌ని 1.80 మిలియన్ మంది ఉపయోగిస్తున్నారు. నెలకు 5 లక్షల వరకు స్కాన్లు జరుగుతున్నాయి.
– రవితేజ పుట్రేవు …? నాగవర్ధన్ రాయల