ఎవ్వరూ ఓపెన్ చెయ్యకముందే బయోకెమీ క్రియేచర్ ఉన్న బాక్స్‌ను కనిపెట్టాలంటూ హరిశ్వను పురమాయించాడు ఇన్స్పెక్టర్ రుద్ర. డివైజ్ నుంచి సిగ్నల్ అందుకొన్న ఆ బాక్స్.. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్‌లో ఉన్నట్టు హరిశ్వ కనుగొన్నాడు. వెంటనే తన టీమ్‌తో అక్కడికి ప్రయాణమైన రుద్ర.. ఘాట్‌లో ఉన్నవాళ్లందరినీ ఖాళీ చేయించాల్సిందిగా కలెక్టర్ కార్యాలయాన్ని కోరాడు. వైరస్ ఉన్న బాక్స్‌ను కనిపెట్టమని స్థానిక పోలీసులకు సూచిస్తూనే.. ఆ బాక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదంటూ హెచ్చరించాడు.
తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతానికి వారణాసి చేరుకొన్నారు రుద్ర బృందం. అప్పుడే ఆ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పూజారులు తెరిచారు. బయోకెమీ క్రియేచర్ ఎట్టిపరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండేలా చేయమని రుద్ర బృందం విశ్వనాథుడిని మనసులోనే వేడుకొన్నది. ఘాట్‌లో సామాన్య ప్రజలు ఎవ్వరూ లేరు. పోలీసుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాక్స్ ఇంకా దొరకలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పాడు. సిగ్నల్ ట్రేసింగ్ను బట్టి ఘాట్‌లోనే బాక్స్ ఉన్నట్టు తెలుస్తున్నది గానీ, ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఉందో మాత్రం తెలియడంలేదు.
బాక్స్‌లో నుంచి వైరస్ బయటకు వస్తే, ఏమౌతుందో అని ఊహించుకొంటేనే రుద్రలో ఆందోళన మరింతగా పెరుగుతున్నది. ఇంతలో ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ కలుగజేసుకొంటూ.. ‘రుద్ర.. నాకు ఓ సందేహం ఉందిరా. అయితే, బాక్స్‌ను కనిపెట్టడానికి అది మనకు ఎంతవరకూ పనికొస్తుందో తెలియడంలేదు’ అనగానే.. పర్లేదు చెప్పమన్నట్టు సైగ చేశాడు రుద్ర. ‘సాధారణంగా వైరస్‌లాంటి సూక్ష్మజీవులు ఎక్కువ వేడిలో బతకలేవు. అలాంటిది ఎప్పుడూ చితి మంటలతో సెగలు కక్కే ఈ ఘాట్‌లో ఆ బాక్స్‌ను పెట్టడం ఏంటో నాకు అర్థంకావట్లేదు’ అని తన అనుమానాన్ని వ్యక్తపరిచింది జయ.
వెంటనే ఏదో స్ఫురించినట్టు అప్రమత్తమైన రుద్ర.. అత్యంత చల్లగా ఉన్న ఏదైనా బాక్స్ ఘాట్‌లో ఎక్కడైనా ఉందేమో చూడమని అప్పటికే అక్కడ వెదుకుతున్న నిపుణుల బృందానికి సూచించాడు. వైరస్లు బతుకాలంటే మైనస్ సెంటిగ్రేడ్లలో ఉష్ణోగ్రత ఉండాలన్న విషయాన్ని టీమ్ సభ్యులకు చెప్తూ.. తాను కూడా వెదకడం ప్రారంభించాడు రుద్ర. అయితే, థర్మల్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ డివైజ్లతో ఘాట్ మొత్తం ఎంత వెదికినప్పటికీ, ఆ బాక్స్‌ను పట్టుకోవడం ఎవ్వరి వల్ల కాలేదు. దీంతో ఇంతదూరం వరకూ వచ్చి మూడో దశను నిలువరించలేకపోతున్నామే అని రుద్ర అండ్ టీమ్ సభ్యులు అందరూ ఆందోళనలో కూరుకుపోయారు.
అప్పుడే తూర్పున ఆకాశం కొంచెంకొంచెంగా ఎర్రబడుతున్నది. ఉదయించడానికి భాస్కరుడు ఉరకళెత్తుతున్నాడు. అప్పటికే, మూడో దశ స్టార్టయ్యి ఆరేడు గంటలైంది. రుద్ర గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇంతలో హరిశ్చంద్ర ఘాట్‌కు దక్షిణాన గంగ తీరంలో ఏవో ప్రభావవంతమైన వెలుగులు కనిపించాయి. గంటల చప్పుళ్లతో మంత్రాలు వినిపిస్తున్నాయి. అవేంటని? స్థానిక పండితులను అడిగాడు రుద్ర. ‘సార్.. అది అస్సీ ఘాట్. గంగమ్మకు ఉదయాన్నే అక్కడ హారతులు ఇవ్వడం సాంప్రదాయం’ అని పండితులు చెప్తూ ఉండగానే, మధ్యలో కలుగజేసుకొన్న రుద్ర.. ‘మరి ఆ ఘాట్‌లో హారతి ఎవరు ఇస్తున్నారు. మనుషులు లేకుండా దీపాలు ఎలా వెలుగుతున్నాయి?’ అనగానే.. దానికి బదులిస్తూ.. ‘క్షమించండి సార్.. మీరు సరిగ్గా గమనించడంలేదనుకొంటా.. ఆ ఘాట్ మెట్లమీద పూజారులు ఉన్నారు.
అయితే, నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాళ్ల భుజాల వరకూ నీళ్లు వచ్చాయి. తొలి హారతిని ఇచ్చే ప్రదేశం మారకూడదని వాళ్లు ఘాట్ మెట్ల ద్వారా నీళ్లలోకి దిగారు’ అంటూ పండిట్స్ చెప్పారు. ఆ మాటలు వింటున్న రుద్ర మైండ్‌లో ఏదో మెరిసినట్టు అనిపించింది. అంతే, పది నిమిషాలు గడిచిందో లేదో.. వైరస్ ఉన్న బాక్స్‌ను విజయవంతంగా కనిపెట్టాడు రుద్ర. అంతేకాదు, హరిశ్చంద్ర ఘాట్‌లో చితిమంటలు సెగలు కక్కుతున్నా.. ఆ బాక్స్‌ను చల్లగా ఎలా ఉంచారన్న విషయాన్ని కూడా టీమ్ మెంబర్స్‌కు వివరించాడు. మరి, రుద్ర ఏం చెప్పాడో మీరు కనిపెట్టారా?
సమాధానం:
బయోకెమీ క్రియేచర్ ఉన్న బాక్స్‌ను హరిశ్చంద్ర ఘాట్‌లోనే పెట్టారు. అయితే, ఘాట్‌లోని చితి మంటల మధ్యలో కాకుండా గంగనదిలోకి దిగేప్పుడు వచ్చే చివరి మెట్టు మీద ఆ బాక్స్‌ను ఉంచారు. లోపల మైనస్ సెంటిగ్రేడ్లతో ఉష్ణోగ్రతను సెట్ చేయడంతో పాటు ఆ బాక్స్‌కు నీటి ప్రవాహం తగిలేలా ఉంచడంతో వైరస్ ఉనికికి ఏమీ కాలేదు. నదిలో మునిగిన మెట్లు కూడా హరిశ్చంద్ర ఘాట్‌కు సంబంధించినవే కాబట్టి అలా మొత్తంగా ఘాట్‌లో బాక్స్ ఉన్నట్టు మ్యాప్‌లో చూయించింది. దీంతో రుద్ర టీమ్ కన్ఫ్యూజ్ అయ్యి కేవలం నది ఒడ్డున ఉన్న ఘాట్‌లోనే వెదికింది. దీంతో వైరస్ బాక్స్ దొరకలేదు. అయితే, అస్సీ ఘాట్‌లో గంగ హరతి ఉదంతం ఎట్టకేలకు రుద్ర చేతికి బాక్స్ వచ్చేలా చేసింది. ఇది ఆ కాశీ విశ్వనాథుడి దయేనంటూ గట్టిగా ప్రణమిల్లాడు రామస్వామి. జతకూడారు మిగతా టీమ్ సభ్యులు రుద్రతో సహా!
-రాజశేఖర్ కడవేర్గు