పాల్వంచ రూరల్, మే 30 : రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తోందని మండిపడ్డారు.
పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కేంద్రం తెచ్చిన మద్దతు ధర జీవో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, కొంగర అప్పారావు, శనివారపు శ్రీనివాసరావు, నామా పండు, వగ్గెల పద్మ, తాటి నాగరాజు, ఆర్.వెంకటేశ్వర్లు, వేల్పుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.