వాషింగ్టన్ : రక్త పోటు (బీపీ) మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) సవరించింది. వీటిలో మార్పులు చేయడం 2017 తర్వాత ఇదే మొదటిసారి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇతర గ్రూపులతో కలిసి ఈ హై బీపీ మార్గదర్శకాలను రూపొందించింది. 20-30 ఏండ్ల మధ్య ఉన్న యువతకు గుండె సంబంధిత ముప్పు గతంలో కన్నా పెరిగిన నేపథ్యంలో ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. హై బీపీని ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంపై ఈ కొత్త మార్గదర్శకాలు దృష్టి పెట్టాయి.
ఈ కొత్త మార్గదర్శకాల్లో బీపీ కేటగిరీలు మారలేదు. నార్మల్ (<120/80), ఎలివేటెడ్ (120129/<80), స్టేజ్ 1 (130139/8089), స్టేజ్ 2 (140/90) mm Hg గా కొనసాగుతున్నాయి. మార్పు ఏమిటంటే, జీవనశైలిలో మార్పులు, అవసరమైతే మందుల వాడకం వంటివాటిని ముందుగానే అమలు చేయడమే. ఈ మార్గదర్శకాల ప్రకారం, రోజుకు వాడే సోడియంను 2,300 ఎంజీ నుంచి 1,500 ఎంజీకి తగ్గించుకోవాలి. ఆల్కహాల్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలి.
ఆరోగ్య సమస్యలు పెరిగితే కేవలం జీవన శైలి మార్పుల వల్ల సత్ఫలితాలు రావు. మందులను వాడటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, 3-6 నెలలపాటు ఆరోగ్యకరమైన మార్పులు చేసిన తర్వాత కూడా స్టేజ్ 1 హైపర్టెన్షన్ కొనసాగితే, వైద్యులు వెంటనే మందులను సూచించవచ్చు. స్టేజ్ 2 హైపర్ టెన్షన్ గలవారికి సింగిల్ పిల్లోనే రెండు మెడికేషన్స్ను ప్రారంభించాలి. దీనివల్ల నియంత్రణ పెరుగుతాయి.