న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ పాకిస్థాన్‌కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగమైన మెయిన్ లైన్-1(ఎంఎల్-1) రైల్వే ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకుంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల చైనాను సందర్శించగా సీపీఈసీ ఫేస్-2 కింద నిధులు సాధించడంలో, కొత్త ప్రాజెక్టులు పొందడంలో విఫలమయ్యారు.
దీనికి బదులుగా వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, ఉక్కు వంటి రంగాలలో 850 కోట్ల డాలర్ల(భారతీయ కరెన్సీలో రూ. 7,500 కోట్లు) అవగాహనా ఒప్పందాలను మాత్రం చైనాతో కుదుర్చుకోగలిగారు. కాగా, ఒకపక్క అమెరికాతో పాకిస్థాన్ అంటకాగడం, మరోపక్క ఇటీవల టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకారం సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో చైనా, రష్యాతో భారత్ సంబంధాలు బలపడడం వంటి పరిణామాల నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పు చోటుచేసుకుంది.
చైనాకు చెందిన వాయువ్య నిన్జియాంగ్ ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు చెందిన అరేబియా సముద్ర రేవు గ్వదార్ను కలిపే లక్ష్యంతో ఈ ప్రధాన మౌలిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టుకు రూ.5.29 లక్షల కోట్ల(6,000 కోట్ల డాలర్ల) అంచనా వ్యయంతో రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, రైల్వే లైన్లు, పైప్లైన్లు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవైన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషేటివ్(బీఆర్ఐ)లో కీలకమైన భాగం.
దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికాలను కలపడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని అంచనా. చైనా, పాకిస్థాన్ మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడంతోపాటు చైనా ఇంధన దిగుమతులకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నారు. ఎంఎల్-1 రైల్వే ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకోవడంతో రుణం కోసం ఆసియన్ అభివృద్ధి బ్యాంకును ఆశ్రయించాలని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.