Boong Movie | మణిపురి భాషలో తెరకెక్కిన ‘బూంగ్’ చిత్రం ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) 2026 అవార్డుల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ కేటగిరీలో విజేతగా నిలవడమే కాకుండా బాఫ్టా గెలుచుకున్న తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయం తర్వాత మేకర్స్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రపంచ వేదికపై భారతీయ ప్రాంతీయ సినిమా సత్తాను చాటిన ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలోకి రాబోతుంది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా, లక్ష్మీప్రియ దేవి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే, మణిపూర్‌లోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ‘బూంగ్’ అనే చిన్నారి చుట్టూ కథ తిరుగుతుంది. తన తల్లి ముఖంలో చిరునవ్వు చూడాలని తపించే ఆ బాలుడు, ఆమెకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి తన తండ్రిని తిరిగి ఇంటికి తీసుకురావడమేనని బలంగా నమ్ముతాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి తండ్రి కోసం అతడు చేసే అన్వేషణ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. దర్శకురాలు లక్ష్మీప్రియ దేవి చిన్నపిల్లల అమాయకత్వాన్ని, వారిలోని స్వచ్చమైన ప్రేమను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు.