న్యూఢిల్లీ: మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకుని ఓటర్లలో ముఖ్యంగా మహిళా ఓటర్లలో తన పట్ల సానుభూతి ఏర్పడే ప్రయత్నం చేశారు. ఎవరో అనామకుడు తన తల్లిని దూషించినందుకు అంతలా బాధ పడుతున్న మోదీ గతంలో మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గతంలో మోదీ తన దివంగత భార్యనుద్దేశించి రూ.50 కోట్ల గర్ల్‌ఫ్రెండ్ అంటూ నీచంగా చేసిన వ్యాఖ్యలను మరచిపోయి ఉండవచ్చేమో కాని తాము మరచిపోలేదని ఆర్జేడీ నేత తేజస్వీ గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి జెర్సీ ఆవు, వితంతువు అంటూ మోదీ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను కూడా ప్రజలు మరచిపోలేదని ఆయన గుర్తు చేశారు. మహిళలు, బాలికలపై అత్యాచారానికి పాల్పడిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఎన్నికల ప్రచారం చేసిన మోదీకి మహిళలంటే ఎంతటి గౌరవమో ప్రజలందరికీ అర్థమైందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ నాయకురాలు రోహిణీ ఆచార్య కూడా తన సోదరుడి వాదననే బలపరుస్తూ కుటుంబ సభ్యులను దూషించకూడదన్న నియమం ప్రధాని మోదీకి కూడా వర్తిస్తుందని చెప్పారు. తల్లి ఎవరికైనా తల్లేనని, ఈ విషయం మోదీకి కూడా అర్థం కావాలని ఆమె హితబోధ చేశారు. గతంలో మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు మోదీ ఇప్పటివరకు క్షమాపణ కూడా చెప్పలేదని ఆమె గుర్తుచేశారు. కాగా, ప్రధాని మోదీ తల్లిని అవమానించారని బీజేపీ నాయకులు బీహార్ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించడంతోపాటు సెప్టెంబర్ 4న రాష్ట్ర బంద్ కూడా జరిపారు. ఒక పక్క ఓటరును చైతన్య పరిచేందుకు యాత్రలు చేస్తూ ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్లను తిరిగి చేర్పించేందుకు ప్రతిపక్ష కూటమి కృషి చేస్తుండగా సెంటిమెంట్ రాజకీయాలతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీహార్ ఓటర్లు ఏ వైపు మొగ్గుతారో రానున్న రోజుల్లో తేలిపోనున్నది.