(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : యుద్ధంలో సర్వం కోల్పోయినప్పటికీ, గెలువడానికి సాయపడే చిట్ట చివరి అస్త్రం ఒకటి ప్రతీఒక్కరి దగ్గర ఉంటుంది. ఓటమి అంచునకు చేరుకొనే సమయంలో శత్రువుల మీదకు దీన్ని ఆఖరి ఆయుధంగా ప్రయోగిస్తారు. అచ్చం అలాంటి అస్త్రమే అగ్రరాజ్యం అమ్ములపొదిలోని ‘డూమ్స్‌డే ప్లేన్’. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ‘ఇ-6బీ మెర్యురీ బోయింగ్’ విమానం (డూమ్స్‌డే ప్లేన్) పశ్చిమాసియా గగనతలంలో కనిపించింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధం సంభవించబోతుందా? అని అంతటా చర్చ మొదలైంది.
అమెరికాకు చెందిన సైనిక, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు మొత్తం దెబ్బతిన్నప్పటికీ, శత్రువులపై ప్రతిదాడి చేసేందుకు సాయపడే అత్యంత శక్తిమంత చిట్టచివరి అస్త్రమే ‘ఇ-6బీ మెర్యురీ బోయింగ్’ విమానం (డూమ్స్‌డే ప్లేన్). యుద్ధం చివరి దశలో సముద్ర గర్భంలోని అణు జలాంతర్గాములు, భూమి మీద ఖండాంతర క్షిపణులు, గాల్లోని బాంబర్ విమానాలకు అవసరమైన న్యూక్లియర్ కోడ్స్‌ను ఇది చేరేవేస్తుంది. తద్వారా ప్రత్యర్థి వ్యూహాలను నాశనం చేస్తుంది.
శత్రు సైన్యంపై దాడులకు ఈ డూమ్స్‌డే ప్లేన్ వ్యూహాత్మకంగా మూడు విధాలుగా సందేశాలను పంపిస్తుంది. ఈ ప్లేన్‌కి 5 మైళ్ల పొడవైన యాంటెనా ఉంటుంది. సంక్షోభ సమయాల్లో సముద్ర జలాల్లోని జలాంతర్గాములకు సందేశాలను పంపించడానికి ఈ విమానం 25 వేల అడుగులకు పైగా ఎత్తులో ఎగురుతుంది. అప్పుడు యాంటెనా నిలువుగా సముద్రంపైకి వచ్చి సబ్మెరైన్లకు సందేశాలను పంపిస్తుంది. ఇక, భూమి మీద ఉన్న ఖండాంతర క్షిపణులను ఈ విమానం గాల్లో నుంచే రిమోట్ విధానంలో ఆపరేట్ చేయగలదు. అణ్వస్ర్తాలను మోసుకెళ్లే బాంబర్ విమానాలతోనూ సమన్వయం చేసుకొంటూ దాడులను ముమ్మరం చేయగలవు. అలా.. భూ, జల, వాయు మార్గాల్లో శత్రువులపై ఈ ప్లేన్ ముప్పేట దాడి చేయగలదు. సంక్షోభ సమయాల్లో అమెరికా అధ్యక్షుడు, సైన్యాధిపతులకు జలాంతర్గాములకు మధ్య టేక్ ఛార్జ్ అండ్ మూవ్ ఔట్ (టీఏసీఏఎమ్వో) విధులను ఈ విమానమే నిర్వహిస్తుంది. అమెరికా దగ్గర ఇలాంటి విమానాలు 16 ఉన్నట్టు సమాచారం.
