ఆయుధాలను అప్పగించి లొంగిపోతున్న మావోయిస్టులను చేరదీస్తున్న ప్రభుత్వాలకు మాజీలు శత్రువులుగా కనిపించడం వింతగా ఉన్నది. తమ తోటివారి సంతాపసభలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వారిని దేశద్రోహుల కింద జమ కడుతున్నది. గత అక్టోబర్‌లో ఆపరేషన్ కగార్ కాల్పుల్లో మరణించిన ఓ మావోయిస్టు అంత్యక్రియల్లో, సంతాప సభలో పాల్గొన్న 230 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల నోటీసులు జారీ చేసినట్లు పత్రికల్లో వచ్చింది. అందరినీ మాజీ మావోయిస్టులుగా ముద్ర వేయడం మరింత విచిత్రంగా ఉన్నది.
ఒకవైపు రోజుకు కొందరు అన్నట్లు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తుంటే..మాజీలపై ఈ దాడి ఏమిటని జనం విస్తుపోతున్నారు. ఎన్కౌంటర్లలో చనిపోయిన నక్సలైట్ల సంతాపసభల్లో ‘ఆయన గొప్ప వీరుడు, జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశాడు. ఆయన ఆశయాలను కొనసాగించాలి’ అనే మాటలు సాధారణంగా వినిపించేవే. తెలంగాణ గడ్డపై ఇది సర్వసాధారణమే. ఆ మాటలు అన్నవారుగానీ, విన్నవారుగానీ వెంటనే అడవుల్లోకి వెళ్లి ఉద్యమకారులు అయిపోరు. లోపలివాళ్లే బతుకుజీవుడా అని లొంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా అందులో చేరేదెవరు? నక్సల్స్ వైపు యువత ఎక్కువగా మళ్లిన కరీంనగర్ పల్లెల్లో ఇలాంటి విషాద, ఉద్విగ్న సందర్భాలు ఎన్నో! పోలీస్ కాల్పుల్లో నక్సలైట్లు మరణించినప్పుడు వారి ఊర్లలో జరిగే అంతిమ సంస్కారాల్లో ఇవన్నీ పరిపాటే. దీనికి కారణం..అక్కడి ప్రజల్లో ఉద్యమం పట్ల ఉన్న అభిమానం అనుకోవచ్చు లేదా చనిపోయిన మనిషితో ఉన్న అనుబంధం కావచ్చు. ఇదే మొదటి సంతాపసభ కాదు, చివరిది కూడా కాకపోవచ్చు.
గత అక్టోబర్‌లో మావోయిస్టు అగ్రనేతల్లో కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఒకరు ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించాడు. ఆయన మృతదేహాన్ని తీసికెళ్లిన కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమకు తెలిసిన మనిషి, సుమారు 45 ఏళ్ల తరువాత మృతదేహంగా ఊరికి వచ్చాడని తెలిశాక చుట్టుపక్కల గ్రామాల్లోని వారి బంధువులు, ప్రజలు ఆ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. ఇలాంటి సందర్భాల్లో ఎర్ర జెండాలు, నినాదాలు కూడా మామూలే. అయితే దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఆ సంతాపసభలో పాల్గొన్న వారిపై ఎన్ఐఏ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పాటిస్తున్న ఈ ద్వంద్వ విధానాలతో కొత్తగా గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నది.
కేంద్రం మావోయిస్టుల అణచివేత విధానాలపై తీసుకుంటున్న కొత్త నిర్ణయాలకు, ఎన్ఐఏ దూకుడుకు మధ్య సమన్వయలోపం కనబడుతున్నది. పాతవారు లొంగిపోతుండగా సాధారణ పౌరులకు మాజీలుగా ముద్ర వేస్తే..లొంగుబాట్లపై ప్రభుత్వాలు ఇస్తున్న వెసులుబాట్లకు అర్థమే లేదు. నక్సలైట్లను అణచివేశాక అర్బన్ నక్సలైట్ల భరతం పడతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుంటారు. మావోయిస్టుల అధ్యాయమే ముగుస్తున్నప్పుడు అర్బన్ నక్సలైట్ల గొంతు మూగబోయినట్లే. ఆపరేషన్ కగార్ మొదలైనప్పుడు ‘కాల్పులు ఆపాలి, శాంతి చర్చలు జరపాలి’ అన్నవారు..లొంగుబాట్లను చూసి విస్తుపోయారు. అడవిలోనే వారి అలికిడి ఆగిపోయాక ఇక అర్బన్‌లో ఏముంటుంది? ఆ సిద్ధాంతంపై, దానిని పాటించిన వ్యక్తులపై బీజేపీ నేతలకు సహజంగానే కసి ఉంటుంది. మాజీ అని, అర్బన్ అని ముద్రలేసి సాధారణ జీవితం గడుపుతున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం కార్యాచరణ లోపమే అవుతుంది.
నక్సలైట్ల అణచివేతలో భాగంగా ప్రభుత్వాలు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఆ ఉద్యమానికి యాభై ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నందున నక్సలైట్లలో మాజీలు ఉన్నారు. పట్టుబడి, శిక్షలు పడి జైళ్లకు వెళ్లివారు ఉన్నారు, లొంగిపోయి కేసులను ఎదుర్కొంటూ సాధారణ జీవితం గడుపుతున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అగ్రనేతలే లొంగిపోతున్న తరుణంలో వారికన్నా ముందే ఏదోవిధంగా ప్రజల్లోకి వచ్చినవారు నేరస్తులు ఎలా అవుతారనేది అసలు ప్రశ్న. నేరం చేయాలని పార్టీ సభ్యులను ఆదేశించినవారు లొంగిపోతుంటే, వారి ఆదేశాల మేరకు నేరం చేసి జైళ్లలో ఉన్నవారి పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? నేరానికి ప్రణాళిక రచించడం, పురిగొల్పడం కూడా చట్టపరిధిలో నేరమే. నాయకస్థాయిలో ఉన్నవారు లొంగిపోయి తమ తలపై ఉన్న నగదు బహుమతిని తీసుకొని ఇండ్లకు వెళ్తుంటే దళ సభ్యులు జైళ్లలో మగ్గడం ఒక విరోధాభాసమే. ఒకేవిధమైన నేరం చేసినవారు ఒకరు బయట ఉండడం, మరొకరు లోపల ఉండడం చట్టానికి పరీక్షే.
ఇంతవరకు లొంగిపోయిన వారిలో ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. లొంగిపోయినవారి కేసుల విషయంలో చట్టం సానుభూతితో పరిశీలించాలని ఓ లొంగుబాటు సభలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టులు అంటూ ఏకంగా 230 మందికి జారీ చేసిన నోటీసుల విషయంలో ఎన్ఐఏ పునరాలోచన అవసరం. ఎందుకంటే..గత అక్టోబర్ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఉద్యమం తుదిఘట్టంలో ఉన్నందున ఆ ఆవేశాలు చల్లారిపోయాయి. మాజీలు, లొంగిపోయినవారు, అర్బన్ నక్సలైట్లుగా పేరుపడ్డవారు..ఎవరైనా పార్టీ భావజాలాన్ని మోయడానికి సిద్ధంగా లేరు. పార్టీ నిర్ణయం విషయంలో బహిరంగంగా మాట్లాడటం కూడా తగ్గింది. వరుసగా పోలీసు కాల్పుల్లో మావోయిస్టులు మరణిస్తుంటే సానుభూతి కలాల కన్నీళ్ల కవిత్వం కొంతకాలం వచ్చింది. లొంగుబాట్లు పెరిగాక అదీ ఆగిపోయింది. ప్రజా కళలు ఇప్పుడు పాజ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ దశలో తాజా మాజీలను వదిలేసి మాజీలపై చర్యలు అర్థరహితమే.
బద్రి నర్సన్