బీరుట్ : ఇరాన్ రాజధానిపై అమెరికా-ఇజ్రాయెల్ మరిన్ని దాడులు జరపడం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపంలోకి మారుతున్న నేపథ్యంలో సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభ భయాలు పెరిగిపోయాయి. ప్రపంచ పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటైన దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు వెలువడినట్లయింది. గత రెండు వారాలకు పైగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండగా పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ స్థావరాలు, గల్ఫ్ అరబ్ దేశాలకు చెందిన ఇంధన స్థావరాలపైన ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుపుతున్నది. హొర్ముజ్ జలసంధిలో, చుట్టుపక్కల వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడం, దాడులకు సంబంధించి ఇరాన్ చేస్తున్న హెచ్చరికలతో ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ అమెరికాపై ఒత్తిడి అధికమవుతున్నది. సోమవారం నాడు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 100 డాలర్ల మేరకు ఉంది. మరోవైపు యుద్ధాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తమ దేశం కోరుతున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ సోమవారం సోషల్ మీడియా పోస్టులో భ్రమలుగా అభివర్ణించారు.
ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్‌తో అత్యంత బిజీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకుపై సోమవారం ఉదయం ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తున్నది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత యూఏఈ రాజధాని అబూ ధాబిలో ఓ ఇరాన్ క్షిపణి ఓ వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడు ఎమిరేట్స్‌లో ఒకటైన ఫుజైరాలోని ఓ చమురు స్థావరంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి మంటలు చెలరేగాయి. చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 35 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయమిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇప్పటివరకు కొన్ని వందల క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.
గత రెండువారాలకు పైగా సాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక పక్క ఇంధనం, ఎరువుల ధరలు పెరుగగా పేద దేశాల్లో ఆహార కొరతను సృష్టిస్తున్నది. కొన్ని దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ధరలను నియంత్రించడానికి ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. మిత్రదేశాలు తమ యుద్ధ నౌకలను జలసంధి వద్దకు పంపాలని ఇచ్చిన పిలుపునకు స్పందన రాలే దు. ధరల పెరుగుదల అమెరికన్లను బాధిస్తే అది రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లపై ప్రభావం చూపగలదని ట్రంప్ భయపడుతున్నారు. హొర్ముజ్ తెరిచేందుకు యుద్ధ నౌకల ను పంపాలని కోరినట్లు ఆదివారం వెల్లడించిన ట్రంప్ తన పిలుపును తిరస్కరించిన దేశాలను గుర్తుపెట్టుకుంటానని కూడా హెచ్చరించారు.
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ సోమవారం భీకర దాడులు జరిపింది. హిజ్బొల్లా తీవ్రవాద గ్రూపును లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్‌తోపాటు దక్షిణ లెబనాన్‌లోని అనేక నగరాల ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెలీ సైన్యం ఆదేశించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడుల కారణంగా ఇప్పటివరకు 8 లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెలీ దాడుల్లో ఏడుగురు మరణించినట్లు లెబనాన్ అధికారులు చెప్పారు. ఇరాన్లో ఆదివారం రాత్రి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ను ఇరాన్ నిలిపివేసి జర్నలిస్టులపై ఆంక్షలు విధించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి 1,300 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇప్పటివరకు సుమారు 7,600 దాడులు జరిపి 85 శాతం రక్షణ వ్యవస్థలను కూల్చివేసినట్లు సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ షోషానీ విలేకరులకు చెప్పారు. 70 శాతం ఇరాన్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ ధ్వంసం చేయాల్సిన లక్ష్యాలు వేలాది ఉన్నాయని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ముడి చమురు ఎగుమతులన్నింటినీ నిర్వహించే గల్ఫ్‌లోని ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న చమురు ట్యాంకర్లు ముందుకు కదలని కారణంగా ఖర్గ్ దీవిలోని ఇరాన్‌కు చెందిన కీలకమైన చమురు డిపోను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఆదేశాలు జారీచేయవచ్చని అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ పేర్కొన్నది. ఈ చర్యకు అమెరికా సిద్ధపడిన పక్షంలో అమెరికన్ సేనలు భూమిపైకి కాలుమోపక తప్పదు.
అదే జరిగితే ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలు, పైప్లైన్లపై దాడులు జరపవచ్చని వార్తా సంస్థ తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా ప్రధాన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్లో కాలుమోపి యుద్ధం చేయకపోవచ్చని వార్తాసంస్థ అభిప్రాయపడింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన దరిమిలా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటానికి దేశాల సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడానికి తాను కృషి చేస్తున్నట్లు ట్రంప్ ఇది వరకు తెలిపారు. ఖర్గ్ దీవిని ఇరాన్‌కు కిరీటంలోని రత్నంగా అభివర్ణించిన ట్రంప్ దీవిలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించారు. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇరాన్‌ను ఆర్థికంగా చావుదెబ్బ తీయవచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ పేర్కొన్నది.