న్యూఢిల్లీ: బట్ట తలతో బాధ పడేవారికి పెలగే ఫార్మాస్యూటికల్స్ శుభవార్త చెప్పింది. ఇది తయారు చేసిన పీపీ405 మందును వాడితే, నెత్తి చర్మంపైన నిష్క్రియగా ఉన్న వెంట్రుకల రంధ్రాల స్టెమ్ సెల్స్ పునఃక్రియాశీలమవుతాయని, సహజంగా జుత్తు పెరగడానికి దోహదపడుతుందని వివరించింది. ఫేజ్ 2ఏ ట్రయల్‌లో పాల్గొన్నవారిలో పీపీ405ను ఎనిమిది వారాలపాటు ప్రతిరోజూ వాడినవారికి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుదల కనిపించినట్లు తెలిపింది. వీరిలో కొందరికి 20 శాతం కన్నా ఎక్కువ సాంద్రతతో జుత్తు పెరిగింది. మినాక్సిడిల్ లేదా ఫినాస్టెరైడ్ వంటి చికిత్సల వల్ల వెంట్రుకలు రాలిపోవడం నెమ్మదిస్తుంది.
వీటి మాదిరిగా కాకుండా, పీపీ405 నెత్తి చర్మంలోని సూక్ష్మ రంధ్రాల్లోకి ప్రవేశించి, క్రియాశీలంగా లేని రంధ్రాలను ఉత్తేజపరుస్తుంది. ఈ అధ్యయన నివేదికను Clinical Trials.gov లో ప్రచురించారు. దీని ప్రకారం, ఈ చికిత్స వల్ల స్వల్ప దుష్ఫలితాలు ఉంటాయి. నిద్రాణంగా ఉన్న హెయిర్ ఫాలికిల్ స్టెమ్ సెల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఔషధం పని చేస్తుంది.
స్టెమ్ సెల్స్ చచ్చుబడిపోతే, నెత్తి చర్మంపైనగల వెంట్రుకల రంధ్రాలు కుంచించుకుపోతాయి, లేదా వెంట్రుకల ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా జుత్తు పలుచబడుతుంది లేదా బట్టతల వస్తుంది. పీపీ405 నేరుగా ఈ సెల్స్‌పై పని చేస్తుంది. వాటిని పునఃక్రియాశీలం చేస్తుంది. ఈ ఔషధం ఫేజ్ 2ఏ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమవడంతో వచ్చే ఏడాదిలో ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఈ కంపెనీ తెలిపింది.