Tehran airport : ఇరాన్, ఇజ్రాయెల్ (Iran vs Israel) పరస్పర దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. తమపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్.. తాజాగా వాటిని పునరుద్ధరించింది. 20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్ (Tehran) లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విదేశీ విమానం దిగింది.
ఈ విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ‘ఫ్లైయింగ్ దుబాయ్’ సంస్థకు చెందిన విమానం భారీ భద్రత నడుమ ల్యాండ్ అయినట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల అనంతరం తాజా పరిణామం.. ఇరాన్ వైమానిక రంగం స్థిరత్వం సాధించే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి మెహ్దీ రమేజానీ వెల్లడించారు.
అంతర్జాతీయ విమానాలు ఇరాన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని రమేజానీ తెలిపారు. కాగా ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ కూడా అదేస్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. 12 రోజుల ఉద్రిక్తతల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే క్రమంగా వైమానిక సేవలు ప్రారంభమవుతున్నాయి.