Crime news : వివాహేతర బంధం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. భార్య మరొకరితో వివాహేతర బంధం పెట్టుకోవడాన్ని సహించలేక భర్త ఆమెను కత్తితో పొడిచి చంపాడు. భర్తకు మద్దతుగా వెళ్లిన అతడి స్నేహితుడిని గ్రామస్తులు కొట్టిచంపారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని హత్రాస్ జిల్లా (Hathras district) లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హత్రాస్ జిల్లాకు చెందిన ఆదిత్య, గౌరి ఇద్దరు దంపతులు. మూడేళ్ల క్రితం వారి వివాహం జరిగింది. ఈ క్రమంలో బంధువుల్లో ఒకరితో ఆమె వివాహేతర బంధం పెట్టుకుంది. ఆ బంధం క్రమంగా బలపడటంతో గౌరి తన భర్తను వదిలేసి వెళ్లి.. సాహ్పౌ పోలీస్స్టేషన్ పరిధిలోని నగ్లాకాలీ గ్రామంలో ప్రియుడితో కాపురం పెట్టింది.
భార్య వివాహేతర బంధాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త ఆదిత్య గత బుధవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి నగ్లాకాలీ గ్రామానికి వెళ్లాడు. ఈ సందర్భంగా భర్తభార్యల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పటికే కోపంతో రగులుతున్న ఆదిత్య భార్య గౌరి గొడవకు దిగడాన్ని సహించలేకపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపాడు.
దాంతో గ్రామస్తులు ఆదిత్య, అతడి స్నేహితులపై దాడి చేశారు. ఆ దాడిలో ఆదిత్య స్నేహితుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. తలపై కర్రతో కొట్టడంతో తల పగిలింది. చికిత్స నిమిత్తం అతడిని అలీగఢ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిత్యను అతడి ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.