న్యూఢిల్లీ: సోహమ్ పరేఖ్.. సిలికాన్ వ్యాలీలో ఇప్పుడీ పేరు మార్మోగుతున్నది. ఒకేసారి పలు అమెరికన్ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ రోజుకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఈ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ‘మిక్స్‌ప్యానెల్’ సహ వ్యవస్థాపకుడు, ప్లే గ్రౌండ్ ఏఐ ప్రస్తుత హెడ్ సుహైల్ దోషి ఈ మోసాన్ని ఎక్స్ వేదికగా బయటపెట్టాడు.
సోహమ్ పరేఖ్ అనే ఇండియన్ డెవలపర్ ఒకేసారి మూడు నాలుగు స్టార్టప్‌లలో పనిచేస్తున్నాడని, తన గురించి బయటపెట్టకుండా వైసీ (వై కాంబినేటర్) కంపెనీలను మోసం చేస్తున్నాడని రాసుకొచ్చాడు. పరేఖ్‌ను ఓ స్కామర్‌గా అభివర్ణించాడు. అతడితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను పరేఖ్ లక్ష్యంగా చేసుకుంటాడని, వాటిలో ప్రతిష్ఠాత్మకమైన వై కాంబినేటర్ యాక్సిలరేటర్ గొడుగు కింద అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పరేఖ్ రెజ్యుమెను కూడా ఆయన షేర్ చేస్తూ అందులోని 90 శాతం విషయాలు ఫేక్ అని దోషి పేర్కొన్నారు.