వారంతా జూన్ 30న ఉదయం 9.18 గంటల వరకు బతికే ఉన్నారు. పొట్టకూటి కోసం పరిశ్రమలో డ్యూటీకోసం వచ్చిన సగటు జీవులు వీరు. ఆ క్షణంలో జరిగిన భయంకరమైన ఒక్క పేలుడు వారి జీవితాలకు చివరి క్షణంగా మార్చింది. అతి భయంకరమైన అగ్ని వారిని కాల్చివేసింది. కొందరిని గాయాలపాలు చేస్తే, మరి కొందరిని బొగ్గుగా మార్చింది. ఇంకొందరిని బూడిదగా మార్చింది. ప్రమాదంలో మరణించిన వారెవరో, తప్పించుకున్న వారెవరో నాలుగు రోజులైనా స్పష్టత రావడం లేదు.
పేలుడులో కూలిన సిగాచి ఫ్యాక్టరీలో శిథిలాలు తొలిగిస్తుంటే శవాల దిబ్బలు బయటపడ్డాయి. సర్కారుది ఒక లెక్క, పరిశ్రమ సిబ్బందిదొక లెక్క. తమ వారికోసం తిరుగుతున్నవారి లెక్క మరోలా ఉంది. తమవారి ఆచూకీ కోసం రెండు రోజులుగా ఎదురు చూసిన రక్త సంబంధీకులు ఇప్పుడు ఆశలు వదులుకుంటున్నారు. దవాఖానల్లో ట్రీట్మెంట్ జరిగేచోటా వీరి ఆచూకీ లేదు. పటాన్చెరు ఏరియా దవాఖాన పోస్టుమార్టం గదుల్లోని శవాల్లో వీరి తాలూకు మనుషులు లేరు. మిస్సయిన వారి లిస్టుల్లోనూ కనిపించడం లేదు.
Sigachi Industries | పటాన్చెరు రూరల్, జూలై 3 : సిగాచి కంపెనీలో శిథిలాలు తొలిగిస్తుంటే కార్మికుల తాలూకు చివరి జ్ఞాపకాలు బయట పడుతున్నాయి. కొందరి ఐడీ కార్డులు, మరికొందరి బ్యాంకు కాగితాలు, కంటి అద్దాలు, పర్సులు, కంపెనీ పత్రాలు, ఇతర ఎవిడెన్స్ బయట పడుతున్నాయి. కొందరి సెల్ఫోన్లు దొరికాయి. అవి వారి వివరాలను అందజేస్తాయని అధికారులు వాటిని సేకరిస్తున్నారు. స్టాఫ్, ఇతర ముఖ్యమైన అధికారులకు మాత్రమే సెల్ఫోన్ల పర్మిషన్ ఉందని తెలుస్తున్నది. కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సెల్ఫోన్ లోపలికి అనుమతించరని సమాచారం. అవి సంబంధిత మిస్సింగ్ కుటుంబాలకు అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ చిహ్నాలు, జ్ఞాపకాలుగా మారిన వస్తువులను చూసి వారి సంబంధీకులు గుర్తిస్తారనే ఆశ అధికారుల్లో ఉంది.
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా పరిశ్రమ శిథిల్లాల నుంచి మాంసపు ముద్దలు బయటపడుతున్నాయి. డీఎన్ఏ టెస్టులు చేసేందుకు వాటిని అధికారులు నిపుణుల వద్దకు పంపుతున్నారు. భారీ పేలుడుతో శరీరాలు చిధ్రమయ్యాయి. కాలిపోవడంతో కొన్ని శరీర భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయినవారి జాడలేక కంపెనీ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న కార్మికుల కుటుంబ సభ్యులకు, చనిపోయిన వారి గురించి వివరాలు తెలుస్తాయి. శిథిలాలు తొలిగింపు ప్రక్రియలో బయటపడుతున్న అన్ని గుర్తింపు సామగ్రిని వారి కుటుంబ సభ్యులు గుర్తుపట్టేలా అధికారులు ప్రదర్శిస్తున్నారు.