– ఎంపీడీఓ జమలారెడ్డి
బూర్గంపహాడ్, మార్చి 11 : పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ పనులను పూర్తి చేసినప్పుడే ప్రజల్లో వారి సేవలు మరింత గుర్తింపునిస్తాయని బూర్గంపహాడ్ ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో 18 పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లుగా పదవులు చేపట్టిన వారంతా మూడు నెలల కాలంలో ఆయా పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. పంచాయతీల్లో జరిగిన అభివృద్ధిని సమాజానికి చాటి చెప్పే విషయంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో గొప్పదన్నారు. ప్రజల సమస్యలను జర్నలిస్టులు అధికారుల దృష్టికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు, ఉప సర్పంచులు కృషి చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు.
అనంతరం మండలంలోని ఆయా పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచులు మాట్లాడుతూ పదవులను అలంకరించిన తామంతా పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేలా చూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి పంచాయతీలకు వచ్చిన నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేస్తూ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. పంచాయతీల్లో తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలను జర్నలిస్టులు పత్రికల ద్వారా ప్రజలకు చూపుతుండటం ఎంతో అభినందనీయమన్నారు. ముందుగా ఎంపీడీఓ జమలారెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచులను ప్రెస్ క్లబ్ బాధ్యులు, కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్, మోరంపల్లిబంజర్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, లక్ష్మీపురం మేజర్ పంచాయతీల సర్పంచులు మందా నాగరాజు, బానోతు సుభద్ర, బానోతు సరోజ, బాదం వెంకటేష్ రెడ్డితో పాటు మిగతా పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బిజ్జం వెంకట్రామిరెడ్డి, గుద్దేటి ప్రవీణ్, గౌరవ అధ్యక్షుడు తోకల మోహన్‌రావు, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు కొండారెడ్డి, కోశాధికారి గోడపర్తి రాంబాబు, ఉపాధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, సభ్యులు మారుడి చంద్రశేఖర్‌రెడ్డి, జిక్కిరెడ్డి మల్లారెడ్డి, పోలిన రామకృష్ణ, అన్వేష్రరాజు, తేజావత్ గాంధీ, పల్లంటి రమేశ్, కందుకూరి శ్రీనివాసచారి, రాము, దుద్దుకూరి మురళి, వీబీ చారి పాల్గొన్నారు.

‘ప్రజా ప్రతినిధులుగా చేసిన అభివృద్ధి పనులే గుర్తింపునిస్తాయి’