Road accident : జాతీయ రహదారి (National Highway) పై వేగంగా వెళ్తున్న లారీ (Truck).. కారు (Car) ను పక్క నుంచి ఢీకొట్టింది. దాంతో లారీ కొక్కానికి కారు ఇరుక్కుపోయింది. అయినా డ్రైవర్ లారీని ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీ (Uttarpradesh) లో సీతార్పూర్ (Sitarpur) ఏరియాలో జాతీయ రహదారి-30పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని లారీని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కాగా గత నెలలో కూడా సీతార్పూర్ ఏరియాలో ఇదే జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బియ్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పక్కన వెళ్తున్న కారుపై పడటంతో.. అందులోని నలుగురు యువకులు తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయారు. వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా ఆప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.