– బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన
బూర్గంపహాడ్, మార్చి 17 : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు, కల్యాణలక్ష్మి, పేదలకు గృహనిర్మాణ పథకం, రైతులకు రైతుభరోసా, భూ సమస్యల పరిష్కారం తదితర హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఓటువేసిన ప్రజలు ప్రభుత్వ పనితీరుపై నిరాశ వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. అన్నదాతలకు సకాలంలో రైతుభరోసా అందకపోవడంతో పెట్టుబడులకు అప్పులపై ఆధారపడాల్సి వస్తుందని మండిపడ్డారు. పాత పెన్షన్లు పెంపు మాట ఏమోగానీ కొత్తగా ఇస్తానన్న పింఛన్లు సైతం ఇవ్వడం లేదని, దరఖాస్తులు ఇచ్చినా ఆమోదానికి నోచుకోలేదన్నారు.
పేదలకు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మరోపక్క ప్రజలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలుచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ కార్యాలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బీరక సాయిశ్రీను, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గుగులోత్ బాలునాయక్, జిల్లా నాయకులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, కేసగాని శ్రీనివాస్, జిల్లా యువమోర్చ నాయకులు బానోత్ వెంకటేశ్వర్లు, గనిబోయిన శ్రీను, బిజ్జం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మేకల నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి వెలిశెట్టి రామారావు, జక్కం సత్యనారాయణ పాల్గొన్నారు.