న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశం నేపథ్యంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు. కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పార్లమెంట్లో విపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. పార్లమెంట్ సమావేశాలను గత వారం నుంచి విపక్షాలు ఈ అంశంపైనే స్తంభింప చేశాయి.
జూలై 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో పార్లమెంట్ హింసాత్మకంగా మారడంతో.. విపక్షాలు కూడా తమ గళాన్ని తీవ్రం చేశాయి. విద్యార్థి లోకంతో పాటు విపక్షాలు కూడా డిమాండ్ చేయడంతో.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరకు ఇవాళ తన రాజీనామాను సమర్పించారు. ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ అకౌంట్లో .. హిందీ భాషలో ఓ లేఖను రిలీజ్ చేశారు.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
ఢిల్లీ నిరసనల వేళ పోలీసులు సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. ఆ సమయంలో అనేక మంది సీజేపీ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యమం ఉదృతమైంది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి మహానగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువతీ యువకులు దండుకట్టి తరలివచ్చారు. మోదీ సర్కారు లీకిన్ ఇండియాగా మారినట్లు కేటీఆర్ తన ప్రసంగంలో ధ్వజమెత్తారు.
దేశరాజధానిలోని జంతర్ మంతర్లో నెల రోజుల నుంచి కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు క్యాంప్ పెట్టారు. తమ ఆందోళనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా మద్దతు తెలిపారు. ఆయన సుమారు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించింది. చివరకు కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆయన తన దీక్షను విరమించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాత్రం ఆందోళన మార్గాన్ని వీడలేదు. జంతర్ మంతర్ నుంచి వాంగ్చుక్ను తప్పించినా..ఆ స్థానంలో దీప్కే తన దీక్షను కొనసాగించారు.
విద్యార్థులు మొదలు పెట్టిన ఆందోళన.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజకీయ రచ్చగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల .. ఆ శాఖను ఎవరికి అప్పగిస్తారన్న ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ప్రధాన్ వారుసుడెవరన్నది ఇంకా తెలియదు. అయితే సీజేపీ నేతలతో మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆ అంశం ఆసక్తికరంగా మారింది. తాజా సంక్షోభాన్ని తెరదించే విషయంలో.. ఇది కీలకమైన రాజకీయ ఎత్తుగడగా మారే అవకాశాలు ఉన్నాయి.
నీట్ పేపర్ లీకేజీ పెను దుమారాన్ని క్రియేట్ చేసింది. ఆ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ పరీక్షకు చెందిన 100 ప్రశ్నలు లీకయ్యాయి. ఆ కేసులో దర్యాప్తు చేపట్టిన కేంద్రం 13 మందిని అరెస్టు చేసింది. కొన్ని కోచింగ్ సెంటర్లపై కూడా కొరఢా రుళిపించింది. తొలుత మే 3వ తేదీన పరీక్ష జరిగింది. లీక్ కావడంతో మళ్లీ జూన్ 21వ తేదీన రీఎగ్జామ్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నీట్ అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది.