నగరంలోని నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో మంగళవారం ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారంటూ ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. మూడు జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు జరగగా పెద్ద ఎత్తున బంగారం, నగదుతో పాటు స్థిరాస్తి పత్రాలు బయటపడినట్లు సమాచారం.
-సిటీబ్యూరో/ఖైరతాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)
ఎర్రగడ్డలో లక్ష్మీభాస్కర్‌కు చెందిన కల్పతరువు అపార్ట్మెంట్స్ సహా ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, బంధువుల నివాసాల్లోను సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి పలు చోట్ల తనిఖీలు చేశారు. నిమ్స్‌లో ఫైల్స్ పరిశీలించారు. ఇప్పటికే కొన్ని అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. నిమ్స్ చరిత్రలో ఒక అధికారిపై మొట్టమొదటిసారిగా ఏసీబీ దాడులు జరిగాయని, గతంలో రిటైర్డ్ ఉద్యోగులపై జరిగినప్పటికీ సర్వీసులో ఉన్నవారిపై జరగడం ఇదే మొదటిసారి అని నిమ్స్ ఉద్యోగులు తెలిపారు. లక్ష్మీభాస్కర్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఆయనపై గతంలోనే కేసులు ఉండగా, నిమ్స్‌లో జరిగే ప్రతి పనిలోను లక్ష్మీభాస్కర్‌కు ముడుపులు ముట్టనిదే ఆ పని జరగదని ఆయనను ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై అధికారికంగా, రాజకీయంగా ఒత్తిడి చేయించి ఇబ్బందులు పెడుతారని పలువురు ఉద్యోగులు చెప్పారు.
లక్ష్మీభాస్కర్ నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంస్థలో నియామకాల విషయంలో పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో లక్ష్మీభాస్కర్‌తో పాటు సంబంధిత శాఖ మంత్రి పీఏ, మాజీ డైరెక్టర్ కూడా భాగస్వాములయ్యారని వారి సహకారంతోనే నియామకాలు కొనుగోళ్లు, కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున వసూళ్లు చేశారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా నిమ్స్‌లో 440 అన్‌స్కిల్డ్ ఉద్యోగులను నియమించారని, వీరంతా ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకమైనవారు కాగా వీరిలో ఒక్కొక్కరి దగ్గర సుమారు లక్షన్నర నుంచి రెండులక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
మరో 81 స్కిల్డ్ ఉద్యోగుల నియామకాల్లో ఒక్కొక్కరి దగ్గర రూ.5లక్షలు వసూలు చేసినట్లు నిమ్స్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సుమారు 8వందల మందిని ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేసి తీసుకుని నియామకం చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కూడా మాజీ డైరెక్టర్ సంతకానికి ఒక రేటు పెట్టి ఆ రేటు ప్రకారమే డబ్బులు ఇచ్చారని, ఇక మంత్రి పీఏకు వాటాలు పంపి అందరిని మేనేజ్ చేస్తూ వందల కోట్ల ఆస్తులు సంపాదించారంటూ లక్ష్మీభాస్కర్‌పై గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది మాత్రమే కాకుండా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు, కాంట్రాక్టర్లకు పనులు కేటాయించి వారి దగ్గర నుంచి కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం దందాలో లక్ష్మీభాస్కర్‌తో పాటు మంత్రి పీఏ, మాజీ డైరెక్టర్ కూడా ఉన్నారని లక్ష్మీభాస్కర్ చేసిన అక్రమాలకు మాజీ డైరెక్టర్ వంత పాడి సంతకాలు పెట్టిన కారణంగా ఆయనకు కావలసినంత ముడుపులు ముట్టాయని నిమ్స్‌లో చెప్పుకుంటున్నారు.
ఇటీవల నిమ్స్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోబోటిక్స్ టెక్నాలజీ విషయంలో కూడా తమ వాటాలు అందిన తర్వాతనే వెలుగులోకి రానిచ్చారంటూ నిమ్స్‌లో ఒక కీలక అధికారి తెలిపారు. అంతేకాకుండా లక్ష్మీభాస్కర్ నిమ్స్‌లో కొందరు మహిళలు, పేషెంట్ల బంధువుల పై వ్యవహరించే తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిమ్స్ ఆసుపత్రిలో అక్రమాలు జరిగాయంటే వాటి వెనుక లక్ష్మీభాస్కర్ ఉంటారంటూ ఉద్యోగులంతా చెప్పుకుంటారు. ఈ వ్యవహారం మొత్తం భాస్కర్ సార్కే తెలుస్తుందని ఆయనకు చెప్పకుండా నిమ్స్‌లో ఒక్క చీమ కూడా కదలదని వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. నిమ్స్‌లో చిన్న పని జరగాలన్నా ఏదైనా ఫైల్ కదలాలన్నా లక్ష్మీభాస్కర్‌ను సంప్రదించాల్సిందేనని కాంట్రాక్టర్లు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా అదనపు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయనకు సంబంధించిన పాత వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ సమయంలో వెంటిలేటర్ బెడ్స్ అమ్ముకున్నారని, నిమ్స్‌లో పటాకులు దాచిన ఘటనలోను ప్రధానంగా ఆయన పేరే వినిపించింది. లక్ష్మీభాస్కర్ సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఇప్పించేందుకు మధ్యవర్తుల ద్వారా రోగుల నుంచి వాటా తీసుకునేవారిని ఆరోపణలు కూడా ఉన్నాయి. 2025లో రాజమండ్రికి చెందిన ఒక వైద్యుడితో జరిగిన రూ.2కోట్ల భూవివాదం విషయంలో చీటింగ్,బెదిరింపులకు పాల్పడినట్లు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో అప్పట్లో లక్ష్మీభాస్కర్‌పై కేసు కూడా నమోదైంది.
సుదీర్ఘకాలంగా ప్రతిష్టాత్మక వైద్యసంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీటితో పాటు గతంలో లక్ష్మీభాస్కర్‌పై భూలావాదేవీలు, నిధుల మళ్లింపు వంటి పలు ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. వీటన్నింటి ఆధారంగానే ఏసీబీ అధికారులు నిఘా పెట్టి, పక్కాసమాచారంతోనే ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిసింది. బ్యాంకు లాకర్లు, డిపాజిట్లు, స్థిరాస్తుల పత్రాలన్నిటిని పరిశీలించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.