Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ చిత్రం రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.4,000 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలని, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికారిక ట్రైలర్ జూలై 24న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అది అనూహ్యంగా వాయిదా పడింది. ఈ నిర్ణయం వెనుక హాలీవుడ్ దిగ్గజ సంస్థ సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులను దక్కించుకోవడమే ప్రధాన కారణమని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ రూపొందిస్తున్న నేపథ్యంలో, కొత్త ప్రమోషనల్ ప్లాన్‌కు అనుగుణంగా ట్రైలర్ విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, విదేశీ మార్కెటింగ్ కోసం సోనీ పిక్చర్స్ దాదాపు రూ.235 కోట్లు, భారతీయ నిర్మాతలు మరో రూ.140 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ప్రచారం, గ్లోబల్ మార్కెటింగ్ కోసం సుమారు రూ.375 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలో ప్రమోషన్స్ కోసం ఇంత భారీ మొత్తం కేటాయించిన తొలి చిత్రంగా ‘రామాయణ’ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అత్యాధునిక ఐమాక్స్ ఫార్మాట్, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ ప్రొడక్షన్ డిజైన్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు..