Rahul Gandhi : నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak), పరీక్షల అక్రమాలపై జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను శనివారం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కలిశారు. నిరాహారదీక్షలో ఉన్న విద్యార్థులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అరెస్టులు చేసినా, బెదిరించినా విద్యార్థులు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గబోరని స్పష్టంచేశారు. విద్యార్థులు ప్రభుత్వం ముందు మూడు రాజీలేని డిమాండ్లు పెట్టారని రాహుల్ తెలిపారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించడం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవడం, ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం తప్పనిసరని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని, ఆయన్ను పూర్తిగా మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని రాహుల్ స్పష్టంచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన వ్యవస్థకు ఆయన ప్రతీకగా మారారని, అందుకే ఆయనపై చర్య తప్పనిసరని అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జీ, పెల్లెట్ గన్స్ ప్రయోగంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని రాహుల్‌గాంధీ చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ వంటి విద్యాసంస్థలు విద్యార్థులను నిరసనల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ‘మీపై ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గొద్దు. విద్యార్థులే దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఎవరూ అడ్డుకోలేరు’ అని రాహుల్‌గాంధీ అన్నారు.