– తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు పున్నంచంద్
బూర్గంపహాడ్, మార్చి 17 : ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం నీరుగారిపోతుందని, బియ్యం సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ బూర్గంపహాడ్ మండల కేంద్రంతో పాటు కొన్నిచోట్ల సన్నబియ్యం కాకుండా మొద్దుబియ్యం, తుట్టెలుపట్టిన, పురుగులు చేరిన బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. రేషన్ దుకాణాల్లో సరఫరా చేసే ఈ బియ్యం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. బియ్యం సరఫరా నాణ్యతపై డీలర్లను ప్రశ్నిస్తే ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యమేనని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, పేదలకు ఇచ్చే బియ్యం సరఫరాపై జిల్లా ఉన్నతాధికారులు గోడౌన్లు, రేషన్ షాపులను తనిఖీ చేస్తే డీలర్ల అక్రమాల్లో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు.