Suicide : ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి తీసుకున్న అప్పు తీర్చలేక, అప్పులిచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అప్పుల వాళ్లు తనను ఎలాంటి మాటలతో హింసించారో తన సూసైడ్ నోట్ (Suicide note) లో రాసిపెట్టాడు. తన భార్యను, బిడ్డను ఆదుకోవాలని నటుడు విజయ్ (Actor Vijay) కి ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puduccheri) లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరికి చెందిన విక్రమ్ (33) ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి ఓ చిన్న కంపెనీ పెట్టుకున్నాడు. ఆ కంపెనీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదేవిధంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అయితే అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో తన కంపెనీపై వచ్చే సంపాదన సరిపోక ఒక చికెన్ షాపులో కూడా పనిచేస్తున్నాడు. అయినా సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోయాడు.
దాంతో అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి వేధింపులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే మార్గం లేక, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు విక్రమ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో విక్రమ్ తన దుస్థితిని గురించి తెలియజేశాడు.
అప్పులు పెరిగిపోవడంతో తీర్చిమార్గం లేకుండా పోయిందని, పైగా అప్పుల వాళ్లు వేధింపులు ఎక్కువయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఒక వ్యక్తి నుంచి రూ.3.8 లక్షలు అప్పుగా తీసుకుని 10 శాతం చొప్పున నెలకు రూ.38 వేల వడ్డీ చెల్లిస్తున్నానని తెలిపాడు. అతడికి వడ్డీ చెల్లించలేకపోవడంతో అప్పుతీర్చే వరకు నా భార్యను, బిడ్డను తన దగ్గరికి పంపమన్నాడని విక్రమ్ తన లేఖలో వెల్లడించాడు.
అప్పుల భారం, వేధింపులతో తనకు జీవితంపై విరక్తి పుట్టిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తెలిపాడు. తన మరణానంతం తన భార్యను, బిడ్డను అదుకోవాలని, అండగా నిలువాలని విక్రమ్.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కి విజ్ఞప్తి చేశాడు. సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు.. విక్రమ్‌కు అప్పులు ఇచ్చి వేధించిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.