Khammam | ఖమ్మం, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసింది. ఖమ్మం అర్బన్ పరిధి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న భూదాన్ భూముల్లో 12 ఏండ్లుగా ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు, కొంతమంది పక్కా ఇండ్లు కట్టుకొని నివాసముంటున్నారు. గడిచిన పదేండ్లలో వెలుగుమట్ల ప్రాంతం ఓ పెద్దకాలనీగా మారింది. కాలనీ ప్రజలంతా ఒక్కటై తమకు పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా భూదాన్ భూముల వివాదం కోర్టులో ఉండటంతో నాడు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో స్థానికంగా భూములు కలిగిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూముల్లో ఉంటున్న పేదలను అక్కడ లేకుండా చేయాలనే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. వారికి అనుకూల అమాత్యుడూ అదే పార్టీలో ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొచ్చిన అంశంగా మారింది. నిరుడు కూడా అమాత్యుడి సాయంతో ఓ దఫా రెవెన్యూ, పోలీసులను ప్రయోగించి కాలనీలోని పలు ఇండ్లను కూల్చివేయించారు. అక్కడ నివసించే బడుగుబలహీన వర్గాలవారి ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేస్తేనే తమ భూముల ధరలు పెరుగుతాయనే కుటిలబుద్ధితో కొందరి పేర్లతో కోర్టుల్లో కేసులు సైతం వేయించారు. అక్కడ ఇండ్లు కట్టుకున్న పేదలకు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయించారు. అయినా ఖాళీ చేయకపోవడంతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి వేలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ పేదల ఇండ్లను మంగళవారం నేలమట్టం చేయించారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదువ అన్నట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు నిరుపేదలపై కొరఢా ఝులిపించారు. కాలనీలో నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేసి ఖాళీ చేయించాలనే ఆలోచనతో ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 600 మంది పోలీసులను రంగంలోకి దింపారు. ఈ తరహా పోలీస్ బందోబస్తును హైదరాబాద్‌లో హైడ్రా విషయంలోనూ వినియోగించారో? లేదో? కానీ ఖమ్మం జిల్లాలో అమాత్యుడు తన అనుయాయుల కోరిక తీర్చేందుకు భారీ అస్ర్తాలనే ప్రయోగించారు. భారీగా పోలీసులను దించడంతోపాటు జిల్లాలోని అన్నిశాఖల ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బందిని వినియోగించి భూదాన్ భూముల్లోంచి పేదలను ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చివేయించారు. కాలనీలో భయానక వాతావరణాన్ని తీసుకరావడంతో కాలనీ ప్రజలు చేసేదిలేక కొందరు స్వచ్ఛందంగానే ఖాళీ చేశారు. మరికొందరిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కోర్టు ఆర్డర్ ఉన్న కారణంగా పది మంది ఇండ్లు కూల్చివేతల నుంచి మినహాయించారు. కానీ కూల్చివేతలకు బాధ్యులైన అసలు సూత్రధారులు మాత్రం సమీప ప్రాంతంలో కనిపించలేదు. పైగా కాలనీలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని, ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి అందించిన నివేదిక మేరకు కూల్చివేతలు చేపడుతున్నారనే విష ప్రచారం చేయించడం వినిపించింది. కానీ మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారన్న ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు.

సుమారు 12 ఏండ్లుగా పక్కా ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలు ఒక్కసారిగా కాంగ్రెస్ సర్కార్ సాగించిన దమనకాండకు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఎన్నో ఏండ్లుగా కష్టం చేసి సంపాదించుకున్న సొమ్ముతో ఇండ్లు కట్టుకున్నామని ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ చేయించి కూల్చివేయించడం ఎక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. బలంవంతంగా ఖాళీ చేయించే క్రమంలో పలువురు నిరుపేదలు ఆర్తనాదాలు చేశారు. అధికారులు, పోలీసులను బండ బూతులు తిట్టారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతున్నదని, ఇది ముమ్మాటికీ బుల్డోజర్ పాలన అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేసి వెళ్లుమంటే ఎక్కడి వెళ్లాలంటూ రోదించారు. ప్రజాపాలన అందిస్తామంటే మురిసిపోయామని కానీ రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన అని దుమ్మెత్తిపోశారు.
ఇంకా తెల్లవార లేదు. ఆ కాలనీలో కుటుంబాలన్నీ గాఢ నిద్రలో ఉన్నాయి. ఉన్నట్టుండి రాకాసి యంత్రాల్లా వచ్చిన బుల్డోజర్ల శబ్దం.. వందలాది మంది పోలీసుల బ్లూట్ల చప్పుళ్లతో అక్కడివాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. ఒక్కసారిగా బయటకు పరుగెత్తి వచ్చి ఏం జరుగుతున్నదో తెలియక అయోమయానికి గురయ్యారు.
భారీ బలగాలతో కలిసి అధికారుల రాకను చూసి ఏదో విషమ పరిస్థితి ముంచుకొచ్చిందని కాలనీవాసులంతా ఏకమై తిరగబడ్డారు. ఇతరులు ఎవరినీ కాలనీలోకి ప్రవేశించకుండా కర్రలతో నిలువరించే ప్రయత్నం చేశారు. దాదాపు గంట పాటు అధికార యంత్రాంగంతో వాగ్వాదానికి దిగారు. కానీ, అధికారులు, పోలీసులు మైకుల్లో చేసిన హెచ్చరికలు, బెదిరింపులతో నిరుపేదలు వెనక్కితగ్గారు.

భయంతో కాలనీవాసులు నిశ్చేష్టులై ఎక్కడివారక్కడే బిక్కచచ్చిపోవడంతో సర్కార్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా రెవెన్యూ యంత్రాంగం బుల్డోజర్లతో పేదల ఇండ్లపై దండయాత్ర చేసింది. 12 ఏండ్లుగా భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న నిరుపేదల నివాసాలను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. సుమారు 700 ఇండ్లను కూల్చడంతో నీడ కోల్పోయిన బాధిత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. చేసేదేమీ లేక నిరుపేదలు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నా.. వారి ఆర్తనాదాలు చెవికెక్కని అధికారులు కూల్చివేతల దమనకాండను కొనసాగించారు.
ఖమ్మం కలెక్టరేట్‌కు సమీపంలోని వెలుగుమట్లలో మంగళవారం ఉదయం 5 గంటలకు కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కారణంగా కాలనీవాసుల కన్నీళ్ల వరదలో కమ్ముకున్న చీకటి ఉదంతమిది!

నేను 15 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వీరాభిమానిగా పనిచేసిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాస్‌రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు ఎంతో కృషి చేసిన. కానీ మంత్రి పొంగులేటి నమ్ముకున్న కార్యకర్త గుండెలపైనే తన్నాడు. నా కుటుంబం ఉసురు శ్రీనివాస్‌రెడ్డికి తప్పక తగులుతది. 15 ఏండ్లుగా ఆయన కార్యకర్తగా ఊడిగం చేసినందుకు రూ.25 లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని కూలగొట్టి నన్ను, నా కుటుంబాన్ని వీధిన పడేసిండు.
– బలి శ్రీనివాసరావు, ఇల్లు కోల్పోయిన బాధితుడు
పేదలకు చెందిన భూదాన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను బలవంతంగా ఖాళీ చేయించింది. ఇక్కడ ఇండ్లు కట్టుకున్న పేదలు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అధికారులెవ్వరూ అడుగుపెట్టొద్దనే ఆదేశాలున్నాయి. కానీ, ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలు చేపట్టింది. దీనిపై లంచ్ మోషన్లో రిట్ పిటిషన్ వేస్తున్నాం. కూల్చివేతలు తాత్కాలికమే భవిష్యత్తులో ఆ భూములన్నీ పేదలకే చెందుతాయి.
– మేకల సుగుణారావు, సీనియర్ న్యాయవాది, ఖమ్మం
